Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడ పిల్లల వివాహ వయో పరిమితి పెంపును రద్దు చేయాలి : ఐద్వా డిమాండ్
న్యూఢిల్లీ : బాలికల వివాహ వయస్సును ప్రస్తుతమున్న 18ఏండ్ల నుంచి 21ఏండ్లకి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఐద్వా తీవ్రంగా విభేదించింది. ఈ చర్య మహిళా సాధికారతను అడ్డుకునేదిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రజల మౌలిక పోషకాహార, విద్యా, ఉపాధి అవసరాలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైన పరిస్థితుల్లో ఈ నిర్ణయం పూర్తిగా అసమర్ధమవుతుందని పేర్కొంది. వాస్తవానికి ఈ చర్య వల్ల ప్రతికూల ఫలితాలే వుంటాయని ఐద్వా పేర్కొంది. తమకిష్టమైనవారిని పెండ్లి చేసుకునే ఐచ్ఛిక వివాహాలను మరింత లక్ష్యంగా పెట్టుకోవడానికే ఈ వివాహ వయస్సు పరిమితి పెంపు లక్ష్యంగా వుందని పేర్కొంది. తనకిష్టమైన వారిని పెండ్లి చేసుకోవడానికి ఇప్పటికే తీవ్ర అడ్డంకులు ఎదుర్కొంటున్న యువతి లైంగికతను నియంత్రించేందుకు ఇదొక మార్గంగా వుంటుందని పేర్కొంది. పరస్పర అంగీకారంతో స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక చర్యను నేరపూరితం చేయడంతో అది తరచుగా కిడ్నాప్లకు, లైంగికదాడులకు, బాల్య వివాహాల నిరోధక చట్టం, 2006 కింద ఇతర రకాల నేరాలకు దారి తీస్తోందని, తద్వారా వారు విడిపోవడానికి, యువకులు నిర్బంధాలకు గురవడానికి కారణమవుతోందని పలు అధ్యయనాల్లో వెల్లడైందని, మన అనుభవాల ద్వారా కూడా స్పష్టమైందని ఐద్వా పేర్కొంది. ఈ కారణంగా ఇటువంటి చర్యలు గోప్యత, స్వయంప్రతిపత్తికి సంబంధించి మహిళల మౌలిక రాజ్యాంగ హక్కులను దెబ్బతీస్తాయని విమర్శించింది. లింగ సమానత్వం కోసం మహిళల వివాహ వయస్సును పెంచుతున్నామని చేస్తున్న వాదన కూడా తప్పేనని పేర్కొంది. పురుషుల వివాహ వయస్సును 18ఏండ్లకి తగ్గించాలని గతంలోనే ఐద్వా డిమాండ్ చేసింది. 18వ లా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. ఇలా చేయడం వల్ల వివిధ రకాల నేరాలకు ఆ వ్యక్తిని వేధించే పరిస్థితులు నివారించబడతాయని పేర్కొంది. ఐసీడీఎస్, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి పోషకాహార కార్యక్రమాలకు తగినన్ని వనరులు కేటాయించడానికి తిరస్కరిస్తున్న ప్రభుత్వం వాటినుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు అనుసరిస్తున్న ఎత్తుగడ ఇదని స్పష్టమవుతోందని ఐద్వా విమర్శించింది. పుట్టినప్పటి నుండి ఆడపిల్లల పోషకాహార పరిస్థితులు సరిగా లేనపుడు 21ఏండ్లకి వివాహం చేసుకుని ఆ తర్వాత పిల్లలకు జన్మనిచ్చినా తల్లీ పిల్లల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడబోవని పేర్కొంది. అందువల్ల తక్షణమే ఆడపిల్లల వివాహ వయస్సును 21ఏండ్లకి పెంచాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది.