Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళన
- గాంధీ విగ్రహం వద్ద మాక్ పార్లమెంట్
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రమేయమున్న కేంద్ర హౌం సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ''అమిత్ షా సహాయ మంత్రి రాజీనామా చేయాలి. అజయ్ మిశ్రాను ప్రధాని మోడీ తొలగించాలి. లఖింపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలి'' అంటూ ప్లకార్డులు పట్టుకొని పెద్ద పెట్టున నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. దీంతో కొద్ది సేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించిన స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వెల్‌లో నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వన్యప్రాణుల (రక్షణ) సవరణ బిల్లు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ది కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ అండ్ ది కంపెనీ సెక్రెటరీస్ (సవరణ) బిల్లు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేషనల్ డోపింగ్ నిరోధక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ ప్రారంభమైన 16 నిమిషాలకే వాయిదా పడింది. సభ సజావుగా జరిగేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చించుకోవాలని సూచించిన చైర్మెన్ ఎం.వెంకయ్యనాయుడు, సభను సోమవారానికి వాయిదా వేశారు.
గాంధీ విగ్రహం వద్ద మాక్ పార్లమెంట్
సస్పెండ్‌కు గురైన 12 మంది ఎంపీల ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాక్ పార్లమెంట్ నిర్వహించారు. సస్పెండ్ అయిన ఎంపీలతో పాటు మిగతా ఎంపీలు కూడా ఆ మాక్ పార్లమెంట్లో పాల్గొన్నారు. మాక్ పార్లమెంట్‌కు సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం చైర్మెన్‌గా వ్యవహరించారు. కొంత మంది సభ్యులు అధికార పక్షంగా, మరికొంత మంది సభ్యులు ఉన్నారు. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డుల పట్టుకొని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. తన కార్లతో రైతులను తొక్కించారని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. దీనికి మిగతా ప్రతిపక్ష సభ్యులు సేమ్ సేమ్ అంటూ నినదించారు.