Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పర్సనల్ డాటా ప్రొటక్షన్' బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్ సూచన
- పౌరుల వ్యక్తిగత, వ్యక్తిగతేతర అంశాలు..బిల్లు పరిధిలోకి
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు సంబంధించి మరో వివాదాస్పద బిల్లును మోడీ సర్కార్ తెరపైకి తెచ్చింది. పర్సనల్ డాటా ప్రొటక్షన్ బిల్, 2019ను గురువారం కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును సమీక్షించిన పార్లమెంటరీ ప్యానెల్, సోషల్ మీడియా కంపెనీల్లో జవాబుదారీతనం తీసుకురావటం కోసం వాటిని 'ప్రచురణకర్తలు'గా చూడాలని సూచించింది. ''సోషల్ మీడియా మాధ్యమాల్ని వెంటనే క్రమబద్దీకరించాల్సిన అవసరముంది. సోషల్ మీడియా పనితీరు ప్రచురణకర్తలకు దగ్గరగా ఉంది. కాబట్టి వాటిని ప్రచురణకర్తలుగానే భావించాలి. మాతృసంస్థ ప్రధాన కార్యాలయం భారత్‌లో లేని ఏ సోషల్ మీడియానూ ఇక్కడ అనుమతించరాదు''అంటూ పార్లమెంటరీ ప్యానెల్ పలు సూచనలు చేసింది. సోషల్ మీడియాలో వెలువడే సమాచారంపై మీడియా రెగ్యులేటరీ అథారిటినీ ఏర్పాటుచేయాలని కేంద్రానికి సూచించింది. ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరి పనిచేయాలని తెలిపింది. అంతేకాదు ప్రతిపాదిత బిల్లును 'పర్సనల్ డాటా ప్రొటక్షన్' పేరుతో పిలవరాదని పేర్కొన్నది. 10 మంది రాజ్యసభ, 10మంది లోక్‌సభ ఎంపీలతో కూడిన పార్లమంటరీ ప్యానెల్‌కు బీజేపీ ఎంపీ పి.పి.చౌదరీ నేతృత్వం వహించారు. పౌర సమాజం, పరిశ్రమ ప్రతినిధులు, వివిధ భాగస్వాములతో సంప్రదింపులు జరిపామని, బిల్లుపై సమీక్ష చేశామని ప్యానెల్ తెలిపింది. అయితే ఈ బిల్లులోని పలు అంశాలపై ప్రతిపక్ష ఎంపీల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.