Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో 'పర్సనల్ డాటా ప్రొటక్షన్' బిల్లు!
- ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు సేకరించే వెసులుబాటు
- ఆరోగ్య సమాచారాన్ని సేకరించిన కంపెనీ ఉద్యోగాన్ని నిరాకరించవచ్చు : నిపుణులు
న్యూఢిల్లీ: ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా పరస్పరం అనుసంధానమై ఉంది. ప్రపంచ జనాభాలో 60శాతం మంది ఇంటర్నెట్తో అనుసంధానమయ్యారు. ఈనేపథ్యంలో వ్యక్తుల గోప్యతా హక్కు ప్రమాదంలో పడిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరుల గోప్యత..ప్రాథమిక హక్కే..అని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంగా తేల్చిచెప్పింది. అయినా మోడీ సర్కార్ మరో వివాదాస్పద బిల్లు 'పర్సనల్ డాటా ప్రొటక్షన్'ను తెరపైకి తెచ్చింది. ఈ బిల్లు త్వరలో పార్లమెంట్ ఉభయ సభల ముందుకు రాబోతోంది. బిల్లు ఆమోదం పొందితే, గూగుల్, ఫేస్బుక్ వంటి కంపెనీలకు, దేశవిదేశాల్లోని బడా కార్పొరేట్ సంస్థలకు పౌరుల వ్యక్తిగత సమాచారం సులభంగా చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగం ఇవ్వాలా ? వద్దా? అన్నది నిర్ణయిస్తాయి
సుప్రీం తీర్పు తర్వాత పౌరుల వ్యక్తిగత గోప్యతను మరింత పటిష్టపర్చాల్సిన మోడీ సర్కార్, దానికి విరుద్ధంగా వెళ్తోందని ముసాయిదా బిల్లులోని అంశాలే చెబుతున్నాయి. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందిస్తామన్న పేరుతో ప్రభుత్వ విభాగాలెన్నో ప్రజల నుంచి వివిధ రకాల సమాచారాన్ని సేకరించాయి. ఇప్పుడీ డాటాను వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సౌలభ్యం ఈ ముసాయిదా బిల్లుతో సాధ్యమవుతుంది. ఉదాహరణకు పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం తీసుకున్న ఒక ప్రయివేట్ కంపెనీ కొంతమందికి ఉద్యోగాలివ్వడానికి నిరాకరించవచ్చు. అంతేకాదు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సమాచారాన్ని సేకరిస్తాయి. అనేక విధాలుగా పౌరులపై నిఘా పెట్టడం సులభ మవుతుంది.
ప్రయివేటు సంస్థల చేతికి..
ఆధార్ డాటాను ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు, బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు వినియోగిస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాలు మరింత మెరుగ్గా అమలుచేయడానికే 'ఆధార్'ను తెస్తున్నామని చెప్పిన మన పాలకులు, ఇప్పుడేం చేస్తున్నారో అందరికీ అనుభవమవుతోంది. తాజా బిల్లు చట్టరూపం దాల్చితే పౌరుల గోప్యతా హక్కు పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు భావిస్తున్నారు. అనేక కంపెనీలు తమ వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వాలు తోడ్పడతాయి. వాటికి అడ్వర్టయిజ్మెంట్ల రూపంలో భారీ ఆదాయం సమకూరుతుంది. అమెరికా ఒత్తిడి మేరకు గూగుల్, ఫేస్బుక్ వంటి బడా కార్పొరేట్ సంస్థల వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ బిల్లును మోడీ సర్కార్ తీసుకొస్తుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.