Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు రోజుల పాటు స్తంభించిన బ్యాంకులు
- ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు, ఆందోళనలు
- సమ్మెలో పది లక్షల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రయివేటీకరణ నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ చేసే బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ బచావో...దేశ్ బచావో (బ్యాంకులను కాపాడండి...దేశాన్ని రక్షించండి) అంటూ బ్యాంకు ఉద్యోగులు నినదించారు. దేశంలోని పలు బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బెఫీ, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీఈ, ఏఐబీఓఏ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ తదితర తొమ్మిది బ్యాంకు యూనియన్ల వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె శుక్రవారం విజయవంతంగా ముగిసింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మూసివేయబడ్డాయి. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఎల్ బ్యాంక్, పంజాబ్, సింధ్ బ్యాంక్‌తో సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ఉద్యోగులు సమ్మెకు దిగారు. బ్రాంచ్‌లలో డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్ క్లియరెన్స్, లోన్ అప్రూవల్‌లు వంటి సేవలు, లావాదేవీలన్నీ సమ్మె కారణంగా ప్రభావితమయ్యాయి.దాదాపు పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. ఆర్థిక రాజధాని ముంబాయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో బ్యాంకు ఉద్యోగులు ఎన్నడూ లేని విధంగా భారీ ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టారు. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో జరిగిన ఆందోళన సహ పలు రాష్ట్రాల్లోనూ వేలాది మంది బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యుఏ, ఏఐసీసీటీయూ, ఎల్పిఎఫ్, యూటీయూసీ, బీకేఎస్ తదితర సంఘాలు బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతు ఇచ్చాయి. అలాగే ఆలిండియా రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆలిండియా రిజర్వ్ బ్యాంక్ వర్కర్స్ ఫెడరేషన్ సహ పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి.కాంగ్రెస్, డీఎంకే , సీపీఐ(ఎం), సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్‌తో సహా పలు రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతు ఇచ్చాయి.
సమ్మె విజయవంతం..
యూఎఫ్‌బీయూ జాతీయ కన్వీనర్ సంజీవ్ కె బంద్లీష్
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు నిర్వహించిన సమ్మె విజయవంతమైందనియూఎఫ్బీయూ జాతీయ కన్వీనర్ సంజీవ్ కె బంద్లీష్ తెలిపారు. తమకు మద్దతు ఇచ్చిన, సంఘీభావం తెలిపిన అన్ని సంఘాలకు, కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ బ్యాంకు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేపట్టామని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బెఫి ప్రధాన కార్యదర్శి దేబాశిష్ బసు చౌదరి పేర్కొన్నారు. యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ బ్యాంకర్స్ యూనియన్ కన్వీనర్ ఎస్కె శ్రీనివాస మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ఇప్పటికే బీమా రంగాన్ని నిర్వీర్యం చేశారనీ, ఇప్పుడు బ్యాంకులను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులను జాతీయం చేయడంతో అణగారిన వర్గాల ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించారని పేర్కొన్నారు. బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే వేల సంఖ్యలో ఉద్యోగులు వీధిన పడడంతో పాటు ఇక సామాన్యులకు బ్యాంకుల సేవలు గగనం అవుతాయని హెచ్చరించారు. ఇలాంటి ప్రతిపాదనలు తక్షణం నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకటాచలం ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి విధానం వల్ల దేశ వ్యాప్తంగా లక్షకు పైగా బ్యాంకింగ్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు బ్రాంచీల కార్యకలాపాలు నిలిచిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఎఐబిఒసి ప్రధాన కార్యదర్శి సంజరు దాస్ మాట్లాడుతూ పీఎస్‌బీలను ప్రయివేటీకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోకుండే రెండో రోజుల సమ్మెతో పాటు భవిష్యత్ ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. దేశంలోని 70 శాతం కంటే ఎక్కువ డిపాజిట్లు ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని, వాటిని ప్రయివేట్ కార్పొరేట్లకు అప్పగించడం వల్ల ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సామాన్యుల డబ్బు ప్రమాదంలో పడుతుందని అన్నారు.
ప్రభుత్వం స్పందించాల్ణి తపన్ సేన్,( సీఐటీయూ)
వీరోచిత సమ్మె చేపట్టిన బ్యాంక్ ఉద్యోగులు, అధికారులకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అభినందనలు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని, బ్యాంకు ఉద్యోగుల గొంతె వినాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెను విజయవంతం చేసినందుకు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారులను సిఐటియు అభినందనలు తెలుపుతుందని తపన్ సేన్ పేర్కొన్నారు. రెండు రోజుల సమ్మెకు కార్మికవర్గం, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పూర్తిగా మద్దతు పలికారని తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బ్యాంకు ఉద్యోగులు ప్రదర్శనలు నిర్వహించగా, ఇతర వర్గాల కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు, నాబార్డ్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, బిఎస్ఎన్ఎల్, డిఫెన్స్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు రంగాల ఉద్యోగులు సంఘీభావం, మద్దతుతో ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యల ఉమ్మడి వేదిక తన మద్దతును అందించిందని అన్నారు. సిఐటియుతో పాటు ఇతర కేంద్ర కార్మిక సంఘాల సభ్యులు కూడా సమ్మెలో ఉన్న బ్యాంకు ఉద్యోగులకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య వారి పోరాటానికి మద్దతుగా ప్రకటన జారీ చేయడంతో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు అంతర్జాతీయ సంఘీభావం కూడా లభించిందని అన్నారు. బ్యాంకుల ప్రయివేటీకరణను తక్షణమే నిలిపివేయాలని, బదులుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సీఐటీయూ డిమాండ్ చేస్తోందన్నారు.