Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఫిలిం ఆర్కైవ్స్, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ కూడా
న్యూఢిల్లీ: దేశంలో పలు చోట్ల ఉన్న ఫిలిం డివిజన్లను మోడీ సర్కార్ మూసేస్తోంది. అంతేకాదు..నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, డైరెక్ట రేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్, చిల్డ్రన్ ఫిలిం సొసైటీలను కూడా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయబోతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డిసెంబర్ 9న ఆయా విభాగాలకు ఆదేశాలు వెళ్లాయని, కార్యాలయాల మూసివేతపై ప్రణాళిక రూపొందించుకోవాలని అందులో పేర్కొన్నారని సమాచారం. ఈ నిర్ణయంతో ఢిల్లీ, ముంబయి, పూణె..ఇతర నగరాల్లోని ఫిలిం డివిజన్లన్నీ మూతపడుతున్నాయి. ఈ కార్యాలయాల్లో దాదాపు 400మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోని ఫిలిం డివిజన్లను, ఫిలిం ఆర్కైవ్స్, ఫిలిం ఫెస్టివల్స్, చిల్డ్రన్ సొసైటీలను 'నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్'లో విలీనం చేస్తామని గత ఏడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. ఈమేరకు గత సోమవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్‌కు సీఈఓగా రవీందర్ భాస్కర్‌ను ఎంపికచేశారు. ఆయనకు ఎన్ఎఫ్డీసీ, ఫిలిం డివిజన్, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ బాధ్యతలు కూడా అప్పజెప్పారు. దీంతో ఆయా సంస్థలన్నీ ఒకే వేదిక కిందకు తీసుకురాబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. వేరు వేరుగా ఉన్న ఆయా సంస్థల్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖలోని ఫిలిం డిపార్ట్మెంట్స్ కిందకు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం చేశారని తెలిసింది.
చరిత్రను తుడిచివేసే కార్యక్రమం : ఎంపీ జాన్ బ్రిట్టాస్
కేంద్రం చేపడుతున్న ఈ మూసివేత చర్యల్ని రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ తప్పుబట్టారు. దేశస్వాతంత్య్రా నికి ముందు నాటి ఎంతో అరుదైన ఆడియో, వీడియోలు ఫిలిం డివిజన్లు, ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్నాయని, వీటిని మెల్లమెల్లగా లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆయా విభాగాల మూసివేత చేపట్టారని ఆయన ఆరోపించారు. బిమల్ జుల్కా కమిటీ చేసిన సూచనలకు విరుద్ధంగా ఫిలిం డివిజన్ల విలీన ప్రక్రియ ఉందని ఆయన విమర్శించారు. దేశ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించే అంశాల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావాలంటే, లాభాపేక్ష లేని ప్రాజెక్ట్స్ ఉండాలంటే ఫిలిం డివిజన్లు, ఇతర విభాగాల్ని యధావిధిగా కొనసాగించాలని అన్నారు.