Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఖాతాలు హ్యాకింగ్
- మాల్వేర్తో దాడిచేసిన సంస్థల్లో భారత్‌కు చెందిన బెల్‌ట్రాక్స్ : ఫేస్బుక్ వెల్లడి
న్యూఢిల్లీ: ఆయా దేశాల్లోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పౌరహక్కుల కార్యకర్తల ఫేస్బుక్ ఖాతాలపై నిఘా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కంపెనీ మాతృసంస్థ 'మెటా' వెల్లడించింది. దాదాపు 50వేల ఖాతాలపై నిఘా కార్యకలాపాలు సాగాయని తాజాగా 'మెటా' ఒక నివేదిక విడుదల చేసింది. భారత్, ఇజ్రాయెల్, ఉత్తర మాసిడోనియా..తదితర దేశాలకు చెందిన కొన్ని సంస్థలు ఈ నిఘా కార్యకలాపాలకు దిగాయని ఒక జాబితా కూడా విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన బెల్‌ట్రాక్స్ సంస్థ ఉంది. ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు సృషించి...కొన్ని ఖాతాల్ని టార్గెట్ చేశారని, ఖాతాల్ని హ్యాకింగ్ చేసి సమాచారాన్ని సేకరించారని నివేదికలో 'మెటా' పేర్కొన్నది. హ్యాకింగ్‌తో నిఘా చర్యలకు దిగిన ఫేక్ ఖాతాల్ని సస్పెండ్ చేశామని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లలోని 1500 పేజీల్ని సస్పెండ్ చేశామని కంపెనీ పేర్కొన్నది. సామాజిక మాధ్యమాల్లో నేరగాళ్లు, తీవ్రవాదులను గుర్తించేందుకు కొన్ని సంస్థలు నిఘా కార్యకలాపాలు చేపడుతున్నాయి. అయితే ఆయా దేశాల్లోని ప్రతిపక్ష నేతలు, పాలకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులు, విమర్శకులు, హక్కుల కార్యకర్తల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయని, వారి ఖాతాల్ని హ్యాకింగ్ చేసి నిఘా చేపడతున్నాయని మెటా తన నివేదికలో పేర్కొన్నది. నిఘా చర్యలు చేపట్టిన ఆయా సంస్థల పేర్లను మెటా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన 'బెల్‌ట్రాక్స్' అనే సంస్థ ఉంది. ఈ సంస్థ మాల్వేర్ సందేశాలతో సోషల్‌మీడియాలో హ్యాకింగ్‌కు దిగుతోందని, ఖాతాదార్ల పాస్వర్డ్లు సేకరిస్తోందని 2020లో 'రాయటర్స్' ఒక వార్తా కథనం వెలువరించింది. మెటా తాజా నివేదికతో ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలు మరింత బలపడ్డాయి. భారత్‌లో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తల సోషల్ మీడియా ఖాతాల్ని లక్ష్యంగా చేసుకొని 'బెల్‌ట్రాక్స్' హ్యాకింగ్ పాల్పడిందని 'మెటా' తన నివేదికలో స్పష్టం చేసింది.