Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచన
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ కేసుల సంఖ్య 100కుమించి వేగంగా విస్తరిస్తోంది. శుక్రవారం నాటికి 12 రాష్ట్రాలకు విస్తరిం చిన ఈ వేరియంట్ కేసుల సంఖ్య 111గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా 19 జిల్లాల్లో కోవిడ్ ఇప్పటికీ తీవ్రంగా ఉందనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. మూడో దశ ముంచుకొచ్చే పరిస్థితులు దాపురిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నివారణ నిబంధనావళిని కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరవరాదని పేర్కొంది. అలాగే సాధ్యమైనంత వరకూ ప్రయాణాలు, గుమిగూడటాలు మానుకోవాలని కోరింది. బ్రిటన్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 11000కు చేరింది. ఇదే పరిస్థితి భారత్లో వస్తే రోజుకు 14లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఢిల్లీలో 22 కేసులు
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22కు చేరింది. శుక్రవారానికి గడిచిన 24 గంటల్లో ఒమిక్రాన్ కేసులతో కలిపి కోవిడ్ కేసుల సంఖ్య 85కు పెరిగినట్లు తెలిపింది. అటు వాణిజ్య రాజధాని నగరం ముంబయిలోనూ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు 32 ముంబయిలోనే నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో 17 కేసులతో రాజస్థాన్, ఎనిమిదేసి కేసులతో కర్నాటక, తెలంగాణ నిలిచాయి. యూపీ, గుజరాత్, కేరళ, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముంబయిలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో రెండు కేసులు అతిపిన్న వయస్సు చిన్నారులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. మూడేండ్ల బాలుడికి, 18 నెలల పాపకు కూడా ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ నిర్ధారణైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన బులిటెన్లో పేర్కొంది. కోవిడ్ హాట్స్పాట్లను గుర్తించి తక్షణమే తగిన నిఘా ఏర్పాటు చేసి విస్తరించకుండా ఆపేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.