Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడు డీఆర్డీఓ సీనియర్ సైంటిస్ట్
- అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ : సంచలనం రేపిన ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు ఘటనలో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ పేలుడు ఘటన వెనక ఉన్నది డీఆర్డీఓ సీనియర్ సైంటిస్టు అని తేల్చారు. పక్కింటిలో నివాసముండే లాయర్‌తో నిందితుడికి ఒక విషయంలో వివాదం ఉన్నదనీ, ఈ విషయంలో లాయర్‌ను చంపేందుకే నిందితుడు ఈ ప్రణాళికను రచించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడు భరత్ భూషణ్ కటారియాను అరెస్టు చేశారు.
ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానా మాట్లాడుతూ.. ఈ విషయంలో దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక బృందం రోహిణి కోర్టుకు వచ్చిన వెయ్యి వాహనాలను తనిఖీ చేసింది. 100కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించింది. అలాగే, బాంబు పేలుడు జరిగిన రోజు కోర్టులో విచారణ జరిగిన కేసులు, కోర్టుకు వచ్చిన వారి గురించి కూడా దర్యాప్తు బృందం ఆరా తీసింది. పేలుడు పరికరం తయారీకి అమ్మోనియం నైట్రేట్‌ను నిందితుడు వినియోగించాడు. బాంబును అమర్చిన ల్యాప్‌ట్యాప్ బ్యాగుపై ముంబయికి చెందిన సంస్థ లోగో ఉన్నదనీ, ఆ సంస్థ గోడౌన్ ఢిల్లీలో ఉన్నదని రాకేశ్ ఆస్థానా వివరించారు. దర్యాప్తులో ఈ సంస్థ తమకు దోహదం చేసిందని తెలిపారు. డీఆర్డీఓలో సీనియర్ సైంటిస్టు అయిన నిందితుడు భరత్ భూషన్ కటారియాను అరెస్టు చేసి ఆయన ఇంటి నుంచి బాంబు తయారీకి వాడే పదర్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పక్కింటిలో నివాసముండే లాయర్ వర్షిత్‌ను ఘటన జరిగిన రోజు కోర్టుకు వచ్చాడనీ, ఆయనను చంపడానికే కోర్టులో కటారియా బాంబును అమర్చాడని తెలిపారు. డిసెంబర్ 9న కోర్టులోని రూం నంబర్ 102లో జరిగిన ఈ పేలుడులో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.