Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోయాయి. రాజస్థాన్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్లలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే తక్కువగా నమోదయ్యాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ప్రభావిత రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు 'కోల్డ్ వేవ్' వార్నింగ్‌ను జారీ చేసింది. ఇటు ఉత్తరాఖండ్‌కు యెల్లో అలర్ట్‌ను పంపింది. శుక్రవారం నాటి ఉష్ణోగ్రతలకు సంబంధించి ఐఎండీ సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో 4.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. సికాపూర్లోని ఫతేపూర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 3.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇక చురులో మైనస్ 1.1, నగౌర్‌లో 0.3, సంగారియా, సికార్‌లలో 0.7 చొప్పున, భిల్వారాలో 1, గంగానగర్‌లో 1.1, పిలానీలో 1.9, చిత్తోర్‌గఢ్‌లో 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి గాలులకు సంబంధించి 18 నుంచి 21 వరకు ఉత్తరాఖండ్‌కు ఐఎండీ యెల్లో అలర్ట్ పంపింది. జమ్మూకాశ్మీర్‌లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. శ్రీనగర్‌లో మైనస్ 6.0 డిగ్రీల సెల్సియస్, బారాముల్లాలో మైనస్ 8.5, పహల్గామ్లో మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్‌తో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలి పరిస్థితులు కాశ్మీర్‌లోయలోని పలు ప్రాంతాల్లో వాటర్ సప్లరు లైన్లు గడ్డకట్టుకుపోవడానికి దారి తీశాయని ఐఎండీ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సీజన్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు ( రెండు డిగ్రీల కంటే తక్కువ) నమోదయ్యాయి. గుజరాత్, హర్యానా, యూపీ, పంజాబ్ లతో పాటు పలు రాష్ట్రాల్లోనూ రానున్న మూడు నాలుగు రోజులు చలి గాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలోను హైదరాబాద్, ఆదిలాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.