Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు
న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా మొదలవుతున్నాయి. ప్రధాని మోడీ దృష్టి అంతా కూడా యూపీపైనే ఉంది. దాంతో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అభివృద్ధి కార్యక్రమాలకు వరుసపెట్టి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.36,230 కోట్ల విలువైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనను ప్రధాని ప్రశంసిస్తూ, విపక్షాలపై మండిపడ్డారు. ''ప్రస్తుతం రాష్ట్రంలో మాఫియా అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయి. ఆ మాఫియాను పెంచి పోషించినవారు తీవ్రంగా బాధపడుతున్నారు. అందుకే ప్రజలు యూపీ+యోగి..ఎంతో ఉపయోగం(ఉపయోగి) అంటున్నారు'' అని యోగి పాలనను ప్రధాని ప్రశంసించారు. రాష్ట్రంలోని ఎక్స్‌ప్రెస్‌వేల నెట్వర్క్, నిర్మితమవుతున్న నూతన విమానాశ్రయాలు, రైలు మార్గాలు ప్రజలకు అనేక వరాలను తీసుకొస్తున్నాయని తెలిపారు. 594 కిలోమీటర్ల నిడివిగల ఈ ఎక్స్‌ప్రెస్‌వే కోసం రూ.36,000 కోట్లకుపైగా ఖర్చు చేస్తామని మోడీ తెలిపారు.
యూపీలో సైకిల్‌ను ఎవరూ ఆపలేరు : అఖిలేశ్
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడే రాష్ట్రంలో కాక మొదలైంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సన్నిహితుల నివాసాల్లో శనివారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఎస్పీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రారు, అఖిలేశ్ వ్యక్తిగత కార్యదర్శి జితేంద్ర యాదవ్, మరో పార్టీ నేత మనోజ్ యాదవ్ నివాసాల్లో ఈ దాడులు జరిగాయి. దీనిపై అఖిలేష్ యాదవ్ కౌంటరిచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. ఇదంతా మొదలౌతుందని తాను ఊహించినట్టు చెప్పారు. ' ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ వచ్చింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ కూడా వస్తుంది. కానీ సైకిల్(ఎస్పీ పార్టీ సింబల్)ను ఎవరూ ఆపలేరు. దాన్ని వేగాన్ని ఆపలేరు. యూపీలో బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతుంది.' అని అన్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలో పయనిస్తోందని అఖిలేశ్ అన్నారు. కాంగ్రెస్ ఎవరినైనా భయపెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి వ్యూహాలనే ఉపయోగించేదని విమర్శించారు.