Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కంలకు చెల్లింపులు ఉండేలా చూడాలి
- తక్షణమే నష్ట తగ్గింపు చర్యలు చేపట్టాలి
- రాష్ట్రాలు ఆర్థికంగా లాభసాటిగా మారాలి: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్
- రాష్ట్రాలతో సమీక్ష
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే రాయితీల లెక్కింపు సరిగా ఉండాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ సూచించారు. శనివారం నాడిక్కడ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, ఇంధన శాఖల అదనపు ముఖ్య కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విద్యుత్ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సీఎండిలు, ఎండిలతో సమీక్ష, ప్రణాళిక, పర్యవేక్షణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి కృష్ణ పాల్ గుర్జార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కె సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని చాలా ముందుకు తీసుకువెళ్లిందని నొక్కిచెప్పారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసామని, ఈ చర్యల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 22 గంటలు, పట్టణ ప్రాంతాల్లో 23.5 గంటలు విద్యుత్ లభ్యత పెరిగిందని తెలిపారు. సరసమైన ధరకు గ్యారెంటీ విద్యుత్ సరఫరాకు తీసుకెళ్లడం తదుపరి దశ అని అన్నారు. పిఎం కుసుం పథకం అనేక రకాల ప్రయోజనాలను ప్రధానంగా అదనపు ఆదాయం, రైతులకు చౌకైన విద్యుత్ అందుతుందని అన్నారు. తగ్గిన సబ్సిడీ భారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోజనం పొందుతాయని, దీనివల్ల పర్యావరణంతోపాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రూపంలో కూడా మేలు జరుగుతుందని అన్నారు. జెన్కోల బకాయిలు పెరగడం గురించి కూడా చర్చించారు. డిస్కమ్‌లు తక్షణమే సరైన మీటరింగ్, బిల్లింగ్, ఎనర్జీ అకౌంటింగ్ ద్వారా నష్ట తగ్గింపు చర్యలను చేపట్టాలని సూచించారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే రాయితీల సరైన లెక్కలు చూపించాలని, డిస్కమ్‌లకు చెల్లింపులు కూడా ఉండేలా చూడాలని తెలిపారు. కార్యాచరణ సమర్థవంతమైన, ఆర్థికంగా లాభదాయకమైన విద్యుత్ పంపిణీ రంగం అవసరమని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రభుత్వం ఇటీవల రూ.3 లక్షల కోట్లు ఖర్చుతో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. సౌభాగ్య పథకం కింద 100 శాతం విద్యుదీకరణను సాధించడంలో రాష్ట్రాలు చేస్తున్న కృషి, సహకారాన్ని విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ అభినందించారు. డిస్కమ్‌ల మెరుగైన ఆర్థిక సుస్థిరత మొత్తంగా విద్యుత్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా తగ్గిన విద్యుత్ ధర, మెరుగైన వినియోగదారుల సేవల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని పునరుద్ఘాటించారు.