Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షార్ట్‌ఫిల్మ్ పోటీల ప్రదర్శనలో సినీ నటులు అజరుఘోష్
గుంటూరు : చిన్న సినిమా పెద్ద సందేశంతో జనం కోసం పనిచేస్తే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సినీనటులు అజరుఘోష్ అన్నారు. ప్రజా నటుడిగా ఎదగాల్సిన బాధ్యత తనపై ఉందని, ప్రజల సమస్యలపై సాంస్కృతిక పరంగా ఏదైనా చేస్తానని తెలిపారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ఎర్రజెండాను మరిచిపోలేనన్నారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మహాసభ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో షార్ట్‌ఫిల్మ్ పోటీలు ఆదివారం నిర్వహించారు. సినీ దర్శకుల సంఘం మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డివిఆర్ కళింగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అజరుఘోష్ మాట్లాడుతూ.. చిన్న సినిమా ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం అంత సులువేమీ కాదని తెలిపారు. కళారూపాల ద్వారా దోపిడీ సమాజాన్ని ప్రశ్నించాలన్నారు. న్యాయనిర్ణేతగా వ్యవహరించిన సినీ దర్శకులు రామ్ భీమన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రెండు నిమిషాల నిడివిలో సినిమా తీయడం చాలా కష్టమని తెలిపారు. పోటీలకు వచ్చిన షార్ట్‌ఫిల్మ్ మేకర్స్‌కు సరైన గైడెన్స్ ఇస్తే ఇంకా బాగా రాణిస్తారన్నారు. అనంతరం షార్ట్‌ఫిల్మ్ పోటీలను ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కెవిఎస్.సాయిప్రసాద్ ప్రారంభించారు. పోటీలకు 72 షార్ట్‌ఫిల్మ్‌లు రాగా వాటిల్లో 30 చిత్రాలను ప్రదర్శించారు. మొదటి బహుమతి విజయవాడకు చెందిన 'రిపబ్లిక్‌డే', రెండో బహుమతి కృష్ణాజిల్లా గొల్లపూడికి చెందిన 'విముక్తి', మూడో బహుమతి హైదరాబాద్ టెలీ మేకర్స్‌కు చెందిన 'దేవుడు' సాధించాయి. విజయవాడకు చెందిన జైహింద్, కాకినాడక చెందిన ఆరంభం, అనంతపురానికి చెందిన రాబంధువు చిత్రాలు కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పాశం రామారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి జెవి.రాఘవులు, ఐక్య కమ్యూనిస్టు నాయకులు రేఖా కృష్ణార్జునరావు, అభ్యుదయ కవి సంధుపట్ల భూపతి తదితరులు పాల్గొన్నారు. అమరావతి బాలోత్సవ్ కన్వీనర్ చంద్రిక యాంకర్‌గా వ్యవహరించారు.