Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకాశ్మీర్‌లో జేకే విద్యుత్ ఉద్యోగులు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లోని పవర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (పీడీడీ)కి చెందిన వేలాది మంది కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నారు. '' ప్రయివేటీకరణ అవసరం లేదు '' అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సుమారు 20 వేలమంది కార్మికులు శుక్రవారం అర్థరాత్రి నుండి సమ్మెకు దిగారు. పీడీడీకి చెందిన లైనెమెన్ నుంచి సీనియర్ ఇంజనీర్, ఇలా ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో భాగస్వామ్యులయ్యారు.జేకే పీడీడీ ని పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే పిడిడి ఆస్తులతో పాటు విద్యుత్ ఉద్యోగుల రోజువారీ వేతన క్రమబద్ధీకరణ, వేతననాల విడుదలను ప్రయివేట్ వ్యక్తులకు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించేంత వరకు మరమ్మతులు గాని, విద్యుత్ సరఫరా నిర్వహణ పనులు గాని చేపట్టమని స్పష్టం చేశారు. జేకేలో దశాబ్దాలుగా నిర్మించిన పీడీడీ ఆస్తులను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రభుత్వ హయాంలో విక్రయించేందుకు సిద్ధమయ్యారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ సెక్టార్ ఆస్తులను విక్రయిస్తున్నారని, అలాగే జెకె ప్రయోజనాలకు విరుద్ధంగా పవర్ గ్రిడ్‌కి 50 శాతం వాటాను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విద్యుత్ ఉద్యోగుల యూనియన్ జనరల్ సెక్రటరీ సచిన్ టిక్కూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యోగుల ఉనికి కోసం పోరాడుతున్నామని, ఇది ప్రజల పోరాటమని, విద్యుత్ శాఖకు వెన్నెముక వంటి ట్రాన్స్మిషన్ రంగాన్ని కోల్పోతే ఇక ఏమీ మిగలదని అన్నారు. అయితే ఈ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ఉన్నతస్థాయి అధికారులు ముందుకు రావడం లేదని అన్నారు. కాగా, పీడీడీ బాధ్యతలను జెకె లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రధాన కార్యదర్శి, యుపి కేడర్‌కి చెందిన ఐఎఎస్ అధికారి నితీశ్వర్ కుమార్‌కి అప్పగించిందని, ఆయన అనుమతి లేకుండా ప్రయివేటీకరణ కార్యరూపం దాల్చే అవకాశం లేదని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నామని కానీ, ఫలితం లేదని పవర్డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ అజాజ్ అహ్మద్ తెలిపారు. దీంతో పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ అంతరాయంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. సమ్మెతో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధానులైన జమ్ము, శ్రీనగర్‌లలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా, డిమాండ్ల మధ్య భారీ వ్యత్యాసం కారణంగా గత కొంతకాలంగా కాశ్మీర్ ప్రజలు తీవ్ర విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు.
శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత శుక్రవారం రాత్రి మైనస్ ఆరు డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్లో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతగా రికార్డులకెక్కింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటున్నాయి. భారీగా మంచు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.