Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో కీలక సమస్యలకు దూరం
- లఖింపూర్ ఖేరీ దారుణంలో కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్ ఉన్నా సైలెంట్..!
- యూపీ ఎన్నికల ప్రచారాల్లో అమిత్‌షాతో అజరు మిశ్రా చెట్టాపట్టాల్..
- ఒమిక్రాన్ ముప్పున్నదన్న హెచ్చరికలూ బేఖాతర్
న్యూఢిల్లీ : గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ దేశప్రధాని కాగానే పార్లమెంట్ మెట్లపై మోకరిల్లారు. అత్యున్నతమైన పదవి కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మరి ఈ ఏడేండ్లలో మోడీ ప్రధాని హౌదాలో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతున్నదనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్లో కీలకమైన సమస్యలు ప్రస్తావనకు వచ్చినపుడు గైర్హాజరవటం సాధారణమైపోయింది. సుమారు 15 రోజులపాటు జరిగిన శీతాకాల సమావేశాల్లో అడపాదడపా హాజరవ్వటం మినహా.. ప్రతిపక్షాలు అడిగిన ఏ ప్రశ్నకూ సమాధానమివ్వటానికి ఆసక్తి చూపటంలేదని ఉభయసభల రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది.
ప్రతిపక్షాలు మాట్లాడటానికీ బీజేపీ పక్ష సభాపతులు అనుమతించటంలేదు. పైగా గతంలో సభ్యులు అడ్డుకున్నారంటూ ఏకంగా 12 మంది సభ్యులపై వేటు వేసింది. దీనిపై చర్చించాలంటున్నా.. సభ్యులను సస్పెండ్ చేయటం..లేక కేంద్రం తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు వాకౌట్ చేయటం.. ఇదీ ఈ సమావేశాల్లో కనిపిస్తున్న సీన్ . వారిని ఎలాగైనా బయటకు పంపి.. తమకు కావాల్సిన బిల్లుల్ని పాస్ చేయించుకుని హమ్మయ్య ప్రతిపక్షాలు సభలో లేకపోవటమే మేలు అన్నట్టుగా బీజేపీ సర్కార్ తీరు కనిపిస్తున్నది.
లఖింపూర్ ఖేరీపై నోరువిప్పట్లే..
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన లఖింపూర్ ఖేరీలో రైతుల మారణకాండపై మోడీ నోరువిప్పటంలేదు. కేంద్రమంత్రి అజరు మిశ్రా టెనీ పేరు ఎఫ్ఐఆర్లో ఉన్నా.. బీజేపీ ప్రభుత్వం సైలెంట్ అయిపోతోంది. కేంద్రమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షా లు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ తాను సభకు వస్తే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సివస్తుందనో..లేక మరోకటో కానీ మోడీ మాత్రం.. ఉభయసభలకూ డుమ్మా కొడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు కేంద్రహౌంమంత్రి అమిత్‌షాతో అజరు మిశ్రా కలిసి యూపీ ఎన్నికల ప్రచారాల్లో బిజీ అయిపోవడం గమనార్హం.
డెల్టా నుంచి నేర్వని పాఠాలు.. వేగంగా ఒమిక్రాన్
కరోనా సెకండ్‌వేవ్ వచ్చినపుడు దేశ ప్రజల్ని గాలికొదిలేసి..మోడీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేసిన విషయం విదితమే. అపుడు జరిగిన అనర్థం అంతా ఇంతా కాదు. భారీగా ప్రాణనష్టం జరిగింది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. చివరికి ఆ తప్పిదాలను రాష్ట్రాలపైకి నెట్టేసే ప్రయత్నం చేసింది మోడీ ప్రభుత్వం. ఇపుడు ఒమిక్రాన్ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా బుసలు మళ్లీ లేస్తున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు పెండింగ్‌లో ఉన్న పెండ్లిండ్లు, శుభకార్యాలతో పాజిటివ్ కేసుల్లో పురోగతి కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి, ఫిబ్రవరి మధ్యలో ఒమిక్రాన్ పడగవిప్పే చాన్స్ ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికల్ని కేంద్రం లైట్ తీసుకుంటున్నది. జనం ప్రాణాలు పోయాక.. చూసుకుందామన్నట్టు సంకేతాలిస్తున్నది. దేశంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ డోసులు సరఫరా కాలేదు. ఇంకా కోట్లాదిమందికి వ్యాక్సిన్ అందలేదు. కేవలం ప్రచారాలతో నెట్టుకొద్దామనుకుంటున్నదే మినహా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలూ తీసుకోవటంలేదన్న చర్చ నడుస్తున్నది. పైగా బూస్టర్ డోస్ విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ ఒమిక్రాన్ విజృంభిస్తే దేశప్రజల పరిస్థితేంటనీ ప్రతిపక్షాలు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
యూపీ ఎన్నికల వైపే...
ఇపుడు మోడీ దృష్టంతా యోగిని ఎలా గట్టెక్కించాలనే. యూపీలో బీజేపీ అధికారంలో ఉన్నా అక్కడ ఎలాంటి అభివృద్ధి గురించి ఎన్నడూ పట్టించుకోని ప్రధాని.. అమాంతంగా కోటాను కోట్ల ప్రాజెక్టులకు శిలాఫలకాలు వేస్తున్నారు. అదిగో..ఇదిగో అంటూ ఇప్పటికే వేసిన ఎన్నో శిలాఫలకాలు ప్రాజెక్టుల రూపంలో కార్యరూపం దాల్చలేదు. తాను దేశానికి ప్రధాని అన్న సంగతి మర్చిపోయి.. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీని గెలిపించటానికి మోడీ రంగంలోకి దిగిపోతున్నారు. యూపీలో ఎటు చూసినా భారీగా జన సేకరణ, బహిరంగసభలు, ప్రచారాల్లో పార్టీలకతీతంగా అందరూ నాయకులు నిమగమయ్యారు. మాస్క్‌లు లేకుండా నేతలు హాజరవుతున్నారు. అయితే గతంలో పశ్చిమబెంగాల్ ఎన్నికలపుడు కరోనా విజృంభించిన తీరును గుణపాఠంలా తీసుకోవటానికి ఏ పార్టీ ఆసక్తి చూపటంలేదు. మరోవైపు పొంచి ఉన్న ఒమిక్రాన్ ముప్పు నుంచి కాపాడటానికి నేనున్నా.. అని దేశప్రజలకు భరోసా ఇవ్వటానికి ప్రధాని మోడీకి అంత తీరిక లేదనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.