Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 మందితో సబ్ కమిటీ ఎన్నిక
- ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసిన ఆలిండియా గర్ల్స్ కన్వెన్షన్
- సబ్ కమిటీలో తెలంగాణ, ఏపీ ప్రతినిధులు
న్యూఢిల్లీ: ఎస్ఎఫ్ఐ ఆలిండియా గర్ల్స్ కన్వీనర్‌గా దీప్సితా దార్ ఎన్నికయ్యారు. అలాగే 28 మందితో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ సబ్ కమిటీ ఎన్నికైయింది. రాజస్థాన్‌లోని సికార్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ ఆలిండియా గర్ల్స్ కన్వెన్షన్‌ను ఉత్సాహభరిత వాతావరణంలో ఆదివారం ముగిసింది. దేశంలోని 19 రాష్ట్రాల నుండి 200 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఈ కన్వెన్షన్‌కు హాజరయ్యారు. మొదటి రోజు నూతన విద్య విధానం, మహమ్మారి ప్రేరిత లాక్డౌన్ కారణంగా విద్య నుంచి విద్యార్థినీలను మినహాయించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది విద్యార్థులు రాజస్థాన్‌లోని సికార్‌లో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గర్ల్స్ కన్వెన్షన్ ఓపెన్ సెషన్లో కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కెకె. శైలజ, టీచర్, నటి, సామాజిక కార్యకర్త సోనియా మాన్, కిసాన్ నాయకుడు అమ్రా రామ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థినీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. కోవిడ్ సమయంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు విద్యార్థినీల డ్రాపౌట్లు పెరిగాయనీ, వారిని తిరిగి తీసుకురావడానికి, విద్యార్థినీల కోసం విద్యా స్థలాలను ఏర్పాటు చేయడానికి కన్వెన్షన్ నిర్ణయించింది. క్యాంపస్‌ల్లో లైంగిక వేధింపులను పరిష్కరించడానికి సంస్థాగత యంత్రాంగాలు లేకపోవడం, అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిమితులతో ఉందని తెలిపింది. శానిటరీ ప్యాడ్లను అందించడం వంటి మహిళా విద్యార్థుల నిర్దిష్ట అవసరాల పట్ల అధికారుల అనుచితవైఖరి ప్రదర్శిస్తున్నారని కన్వెన్షన్ విమర్శించింది. లింగ న్యాయమైన సమాజం ఆదర్శాలకు యువతరాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలని సూచించింది. కరోనా కారణంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల మూసివేత సమయంలో సమాజంలోని అన్ని వర్గాల బాలికలు తమ విద్యను విడిచిపెట్టవలసి వచ్చినట్టు కన్వెన్షన్ పేర్కొంది. ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి, ఆల్ ఇండియా గర్ల్స్ సబ్ కమిటీ దీప్సితా ధర్ మాట్లాడుతూ.. పాఠశాలలో చేరిన 5 మందిలో ఒకరు డ్రాఫౌట్ అవుతున్నారనీ, ఆర్థికంగా, సామాజికంగా అమ్మాయిలపై ప్రభావం మరింత తీవ్రంగా ఉందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు సంగీతా దాస్ మాట్లాడుతూ ఉద్యోగం కోల్పోవడం, వేతన కోత కారణంగా కుటుంబ ఆదాయాలు తగ్గడం, ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసేలా తల్లిదండ్రులు ప్రేరేపించడం అనిశ్చితి వల్ల డ్రాపవుట్లు గణనీయంగా పెరగడానికి కొన్ని కారణాలని పేర్కొంది. ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు యాంటీ డ్రాపౌట్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం వంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థినీల స్థితిగతులను, వివిధ రకాల పితృస్వామ్య, లింగ వివక్షను సవాలు చేసే వ్యూహాలను చర్చించారు. ఎల్జీబీటీక్యూఐఎం విద్యార్థుల్లో ఎస్ఎఫ్ఐ కార్యకలాపాలను పెంచడం, బాల్య వివాహాలు, వరకట్నం, జీఎస్క్యాస్, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేయాలనే అంశాలపై తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. అలాగే విద్యా సంస్థల్లో బాలికల హాస్టల్‌ను నిర్మించాలనీ, క్యాంపస్‌లలో లింగ ఆధారిత వివక్ష, బాలికలకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లను పెంచడానికి పోరాటాలను తీవ్రతరం చేయాలని తీర్మానాలను ఆమోదించారు. నాయకత్వ పాత్రలు పోషించేలా ఎక్కువ మంది విద్యార్థినీలను ప్రోత్సహించడం, నూతన విద్యా విధానం కింద అంగన్వాడీల విధ్వంసానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడటం వంటి తీర్మానాలను కూడా సమావేశం ఆమోదించింది. కన్వెన్షన్ 28 మంది సభ్యులతో అఖిల భారత బాలికల సబ్ కమిటీని ఎన్నుకుంది. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 25 మంది సభ్యులలో 4 మంది సభ్యులు ఆఫీస్ బేరర్లుగా ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా గర్ల్స్ సబ్‌కమిటీ కన్వీనర్‌గా దీప్సితా దార్, కో-కన్వీనర్లుగా సంగీతా దాస్, ఐశ్వర్య, నబోనితా చల్బోర్తిలు ఎన్నికయ్యారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ సాను, మయూక్ బిస్వాస్, ఎస్ఎఫ్ఐ రాజస్ధాన్ కార్యదర్శి సోనూ జిలోవా తదితరులు మాట్లాడారు. లింగ న్యాయం కోసం పోరాటాన్ని బలోపేతం చేయాలని, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం నినాదాలు ప్రతిధ్వనించడంతో కన్వెన్షన్ ముగిసింది.
సబ్ కమిటీలో ఏపీ, తెలంగాణ ప్రతినిధులు
ఎస్ఎఫ్ఐ అఖిల భారత గర్ల్స్ సబ్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాగుర్బి, పావని, తెలంగాణ నుంచి పూజ, శీరిష ఎన్నికయ్యారు.