Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం కనిపిస్తున్నది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం పని పరిస్థితులపై మోడీ సర్కారు ఈ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాలపై ఇప్పటికే దాదాపు 13 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలను సిద్ధం చేశాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్రం కూడా ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ నాలుగు కోడ్ల కింద నిబంధలను ఖరారు చేసింది. అయితే, ఈ అంశం (లేబర్) ఉమ్మడి జాబితాలో ఉన్నందున ఇప్పుడు రాష్ట్రాలూ నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఈ నాలుగు లేబర్ కోడ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం ఉన్నదని సదరు సీనియర్ అధికారి వెల్లడించారు. వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల విషయంలో ఇప్పటికే దాదాపు 13 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలను రూపొందించాయని కొన్నిరోజుల క్రితం రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించిన విషయం విదితమే. అలాగే, వేతనాలకు సంబంధించిన లేబర్ కోడ్‌కు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించి 20 రాష్ట్రాలు, సామాజిక భద్రతకు సంబంధించి 18 రాష్ట్రాలు నియమ నిబంధలను రూపొందించినట్టు వివరించారు.