Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ఆహార ధరలు
- గతంలో.. వంటనూనె, గుడ్లు, మాంసం
- ఇప్పుడు టమోటా..ఇతర కూరగాయలు
- విచిత్రమైన, వింతైన ధోరణి : ఆర్థిక నిపుణులు
- దేశ ఆర్థికరంగంలో గందరగోళం..
ఆహార పదార్థాల (పప్పులు, వంటనూనె) ధరలు హఠాత్తుగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు రూ.90 ఉండాల్సిన వంటనూనె ప్యాకెట్ రూ.180దాటింది. కిలో చికెన్ రూ.140 నుంచి రూ.220కి పెరిగింది. ఇటీవల కిలో టమాటా రూ.100కు చేరువైంది. ఆర్థిక వ్యవస్థలో వింత, విచిత్ర ధోరణికి ఇది ఒక సూచనగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు హోల్‌సేల్ మార్కెట్ ధరలు పెరగడానికి దారితీసిందని, అటు తర్వాత ధరల పెంపు వినియోగదారుడికి బదిలీ అవుతోందని నిపుణులు విశ్లేషించారు.
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం ఆధారిత హోల్‌సేల్, వినియోగదారుల సూచికల గణాంకాల్ని కేంద్రం ఇటీవల విడుదల చేసింది. ధరల్లో మార్పు ఎవ్వరికీ అర్థం కాకూండా గణాంకాల్ని రూపొందించి..మరీ విడుదల చేశారు.
ఒకదానికి మరొకటి పొంతనలేని గణాంకాల్ని, గ్రాఫ్స్‌ను విడుదల చేశారు. ఏది ఎంత చేసినా..ఎంత దాచాలని చూసినా అసలు విషయం మాత్రం దాగలేదు. గత ఏడేండ్లలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 120 నుంచి 166కు పెరిగిందన్న సం గతి బయటకొచ్చింది. నవంబర్‌నాటికి ద్రవ్యోల్బణం ఆధారిత హోల్‌సేల్ ధరలు రికార్డ్‌స్థాయిలో 14.2 శాతం పెరిగాయి. అలాగే ద్రవ్యోల్బణం 4.9శాతం పెరిగిందని కేంద్రం లెక్కలు విడుదల చేసింది. మార్కెట్లో వాస్తవ పరిస్థితిని ఈ గణాంకాలు ప్రతి బింబించటం లేదని నిపుణులు చెబుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్లోనే నిత్యావసర సరుకులు, వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.అటు నుంచి వినియోదారుల వద్దకు వచ్చేసరికి ఆ ధరలు మరింతగా మారుతున్నాయి. మరొక ముఖ్యమైన అంశం ధరలు హఠాత్తుగా పెరగటం. ఇదొక వింతైన గందరగోళంతో కూడిన ఆర్థిక వ్యవస్థను సూచిస్తోం దని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ తరహా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన ఆహార పదార్థాల ధరలు అమాంతం పెరిగిపోతుంటాయి. ఉదాహరణకు కిలో ఉల్లిగడ్డలు, కిలో టమోటా రూ.వందకు చేరటం, వంటనూనె ధరలు రూ.180 దాటడం, అలాగే మాంసం, గుడ్లు ధరలు రెట్టింపు కావటం.
దాదాపు రెట్టింపు అయ్యాయి
కేంద్రం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక ప్రకారం, నవంబర్, 2014-నవంబర్, 2021 మధ్య ఏడేండ్లలో ఆహార ధరలు 120 నుంచి 166కు పెరిగాయి. సులభంగా అర్థం చేసుకోవా లంటే ఏడేండ్ల క్రితం రూ.1200 ఖర్చు చేస్తే వచ్చే ఆహార పదార్థాలకు ఇప్పుడు రూ.1866 పెట్టాల్సి వస్తోంది.
ఉప్పు, పప్పు, వంటనూనె, కూరగాయలు, మాంసం, గుడ్లు..అన్నింటి ధరలూ రెట్టింపు అయిపో యాయి. రికార్డ్‌స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలూ దీనికి ముఖ్య కారణం. దీనిని తట్టుకోవడానికి పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆహారం, ఇతర వస్తువులపై కొనుగోలును తగ్గించుకున్నాయి. గత ఏడేండ్లలో వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ) భారీగా పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్లో ఆహార ధరల్లో మార్పు..వినియోగదారులకు బదిలీ అవుతుంది. అయితే కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో సీపీఐని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని నిపుణులు పేర్కొన్నారు.
ఆదాయం అంతంతే..
ధరలు హఠాత్తుగా పెరిగితే.. కుటుంబ ఆదాయం పెరగదు కదా! మరో చోట ఖర్చును కుటుంబాలు తగ్గించుకుంటాయి. ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పడిపోయినవేళ...ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ గణనీయంగా దెబ్బ తిన్నది. కరోనా సంక్షోభం రాకముందు నాటి కొనుగోలు శక్తి వినియోగదారుల్లో ఇప్పుడు లేదని గణాంకాలు చెబుతు న్నాయి. నిత్యావసర సరుకులు, వస్తు వుల అమ్మకాల తీరులో అది స్పష్టంగా కనపడుతోంది. మొత్తంగా ఆహార పదా ర్థాల అమ్మకాలు కూడా పడిపోయాయి. దీనికి కారణం ఉపాధిదెబ్బతినటం. ఆదాయాలు పడిపోవటం. మార్కెట్లో ఉపాధి అవకాశాలు కనిష్టస్థాయికి చేరుకోవటం. ఉన్న ఉద్యోగాల్లో అత్యధికం అభద్రతతో కూడినవే ఉండటం. ఇవన్నీ మార్కెట్ డిమాండ్ పడిపోవటానికి దారితీసాయి. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలపై మరింత భారాన్ని మోపాయి.