Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన
- కొణిజేటి రోశయ్య మృతికి సంతాపం
న్యూఢిల్లీ : 12 మంది సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలనీ, లఖింపూర్ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ప్రారంభమైన నాలుగు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ మధ్యవర్తిత్వం బిల్లును ప్రవేశపెట్టారు. అయితే బిల్లును లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీకి పంపిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డలు పట్టుకొని వెల్‌లో ఆందోళన కొనసాగించారు. ప్రతిపక్షాల నినాదాలు హోరెత్తడంతో సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. దీంతో ప్రారంభమైన ఐదు నిమిషాలకే సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్యానల్ స్పీకర్ భూబనేశ్వర్ కలిట స్వల్పకాలిక చర్చ కొనసాగించారు. బీజేపీ సభ్యుడు సైద్ జాఫర్ ఇస్లామ్ మాట్లాడిన తరువాత, వెంటనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు ఎవరూ చర్చలో పాల్గొనకుండానే స్వల్ప కాలిక చర్చ ముగిసినట్టు ప్రకటించారు. తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు ఆందోళన ఉధృతం చేశారు. దీంతో సభలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ మాట్లాడుతుండగా అధికార పార్టీ ఎంపీలు కామెంట్స్ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను 39 నిమిషాలు పాటు వాయిదా వేశారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై చర్చ జరిగింది. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తమకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వటం లేదని, తాము ఆడుక్కోవాల్సి వస్తుందని అన్నారు. గతంలో ఎన్నడూ ఇలా లేదని, కావాలంటే రికార్డుల చూడొచ్చని, ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు కోరినప్పుడు అవకాశం ఇవ్వాలని తెలిపారు. దీన్ని తాము ఖండిస్తున్నామని, ఈ పరిస్థితుల నేపథ్యంలో తాము వాకౌట్ చేస్తున్నామని అన్నారు. వెంటనే ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి. అనంతరం బిల్లును ముజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి లోక్‌సభలో సంతాపం తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్నాటక గవర్నర్‌గా, లోక్‌సభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. సభ్యులంతా మౌనం పాటించి నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణంలో మహత్మా గాంధీ విగ్రహం వద్ద 12 మంది సస్పెండైన ఎంపీల ధర్నా సోమవారం కూడా కొనసాగింది.