Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : సుదూర కాలంలో తీవ్ర పర్యవసానాలు కలిగించగల ఎన్నికల చట్టాల్లోని కీలక మార్పులను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. తీవ్రంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లోక్‌సభలో ఈ బిల్లును ఆమోదించారని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కనీసం బిల్లుపై పార్లమెంట్ సభ్యులు చర్చించేందుకు కూడా సమయమివ్వలేదని విమర్శించింది. అన్నింటికంటే ముఖ్యమైనది, సవరణలు చేయడానికి ఎంపీలను అనుమతించలేదు. ఇది పార్లమెంటరీ నిబంధనలను, పద్ధతులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ఎన్నికల చట్టాల బిల్లును కూలంకషంగా పరిశీలించేందుకు గానూ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలంటూ ఉదయం చర్చ జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని విడిచిపెట్టి, ప్రభుత్వం భోజన విరామ సమయం అనంతరం అనుబంధ ఎజెండాను జారీ చేసి, బిల్లును ఆమోదించిందని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో విమర్శించింది. రహస్య బ్యాలెట్ సూత్రాన్ని దెబ్బతీసేలా ఓటు గోప్యతను, గోప్యతకు సంబంధించి ఓటరు ప్రాథమిక హక్కును ఈ బిల్లు ఉల్లంఘిస్తోంది. రాజ్యసభలోనైనా ఈ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కృతనిశ్చయంతో వ్యవహరించాలని పొలిట్‌బ్యూరో కోరింది. సెలక్ట్ కమిటీ ఈ బిల్లును కూలంకషంగా పరిశీలించాలని డిమాండ్ చేసింది.