Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం
న్యూఢిల్లీ:. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడు ఉపసంహరణపై పునరాలోచన లేదని పేర్కొంది. సోమవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ స్పందిస్తూ వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉసంహరణపై పునరాలోచించేది లేదని తెలిపారు. ఆర్ఐఎన్ఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై వివిధ వినతిపత్రాలు మంత్రిత్వ శాఖకు అందాయనీ, అయితే పెట్టుబడుల ఉసంహరణపై పునరాలోచన చేసేదీ లేదని స్పష్టం చేశారు. అలాగే లోక్‌సభలో వైసీపీ ఎంపీలు తలారి రంగయ్య, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, చింతా అనురాధలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావు కరడ్ సమాధానం ఇచ్చారు. 2021 జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణకు ఆమోదం తెలిపిందని అన్నారు. ఆర్ఐఎన్ఎల్ అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్స్‌లో వాటాల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రయివేటీకరణ చేసేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ఆర్ఐఎన్ఎల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన తీర్మానం గురించి తమ ప్రభుత్వానికి తెలుసని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ముందుగానే నిర్ణయం తీసుకుందని, ఇది అనుకూలమైన వినియోగానికి, సామర్థ్య విస్తరణకు, సాంకేతికత ఇన్ఫ్యూషన్, మెరుగైన నిర్వహణ పద్ధతులకు మూలధనాన్ని అందించడానికి దారి తీస్తుందని తెలిపారు. ఇది అధిక ఉత్పత్తి, ఉత్పాదకత, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల విస్తరణకు దారి తీస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 2021 ఫిబ్రవరి 4న కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ విధానాన్ని (కొత్త ప్రభుత్వ రంగ సంస్థల విధానం) తీసుకొచ్చిందని అన్నారు. ఈ విధానంలో భాగంగా వ్యూహాత్మక రంగం కాని సంస్థలు ప్రయివేటీకరణ, లేదా విలీనం, లేదా మరొక సీపీఈఎస్లతో అనుబంధం, లేదా మూసివేస్తామని తెలిపారు. నాన్‌స్ట్రాటజిక్ సెక్టార్లలోని పీఎస్ఈలను సాధ్యమయ్యే చోట ప్రయివేటీకరణ కోసం చేస్తామని, లేకుంటే అటువంటి సంస్థలు మూసివేస్తామని తెలిపారు. నాన్-స్ట్రాటజిక్ సెక్టార్‌లోకి స్టీల్ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.