Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్ల పరిష్కారానికి బదులుగా రంగంలోకి సైన్యాన్ని దింపిన కేంద్రం
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ పవర్ డెవలప్మెంట్ విభాగాన్ని (పీడీపీ) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలన్న కేంద్ర ప్రతిపాదనను నిరసిస్తూ దాదాపు 20వేల మంది ఉద్యోగులు జమ్మూ కాశ్మీర్లో శనివారం నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు కంపెనీలకు అప్పగించాలన్న ఆలోచనలను కూడా వారు నిరసిస్తున్నారు. లైన్‌మేన్ నుంచి సీనియర్ ఇంజనీర్ల వరకు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో చీకట్లు అలుముకున్నాయి. జమ్మూ, శ్రీనగర్లతో సహా పలు జిల్లాల్లో పూర్తిగా అంథకారం నెలకొంది. శీతాకాలం కారణంగా తీవ్రంగా చలిగాలులు వీస్తున్న తరుణంలో ఈ విద్యుత్ సంక్షోభంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లను పరిశీలించి, వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడానికి బదులుగా కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. విద్యుత్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు సాయపడేందుకు సైన్యం సాయాన్ని తీసుకుంటోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఉద్యోగులు సమ్మెలో వున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేవరకు మరమ్మత్తుల పనులు చేపట్టరాదని వారు నిర్ణయించారు. ఆస్తులను ప్రయివేటీకరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. దినసరి వేతన విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. సహజంగానే డిమాండ్, సరఫరాకు తీవ్ర అంతరాయం వుండడం వల్ల కాశ్మీర్లో శీతాకాలంలో విద్యుత్ కోతలు ఎక్కువగా వుంటాయి. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ''ఇది మనుగడ కోసం జరిపే పోరాటం. ప్రజా పోరాటం. ట్రాన్స్మిషన్ సెక్టార్‌ను కోల్పోతే ఇక ఏదీ వుండదు మా దగ్గర. విద్యుత్ శాఖకు ఇదే వెన్నెముక వంటిది.'' అని విద్యుత్ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి సచిన్ టికూ వ్యాఖ్యానించారు.