Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనల మధ్య లోక్‌సభలో ఆమోదించుకున్న కేంద్రం
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘనే
- పుట్టస్వామి కేసులో సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకం
- బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
- స్టాండింగ్ కమిటీకి పంపించాలని డిమాండ్
న్యూఢిల్లీ : ఓటర్ కార్డుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేస్తూ ఎన్నికల చట్టాలు (సవరణ) బిల్లు 25 నిమిషాల్లోనే లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఈ బిల్లు ఉల్లంఘిస్తున్నదనీ, అలాగే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని స్పష్టంచేశాయి. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్‌చేశాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్చ జరిపి, మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకుంది. అలాగే లోక్‌సభలో ద్రవ్య వినిమయ బిల్లు, అనుబంధ పద్దులు కూడా ఆమోదం పొందింది. తదుపరి పరిశీలనకు జీవ వైవిధ్యం సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. రాజ్యసభలో మధ్యవర్తిత్వం బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్టు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పి సింగ్ బఘేల్ ప్రకటించారు. రాజ్యసభలో నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (సవరణ) బిల్లునూ మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయడానికి ఉద్దేశించిన ఎన్నికల చట్టాలు (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు.
గోప్యత హక్కును కోల్పోతం : ప్రతిపక్ష సభ్యులు
ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లు ప్రాథమిక హక్కు అయిన గోప్యతను వ్యతిరేకిస్తుందని అన్నారు. విస్తత పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ అనుసంధానాన్ని ఆధార్ చట్టం అనుమతించదని తెలిపారు. ఆధార్ కేవలం ఆర్థిక, ఆదాయ పన్ను చెల్లింపులు, ఇతర సబ్సీడీలకు మాత్రమే వాడాలని సూచిస్తున్నదని చెప్పారు. ఓటు అనేది చట్టపరమైన హక్కు అనీ, దీనిపై చట్టం చేసే అధికారం లేదని అన్నారు.
టీఎంసీ ఎంపీ సౌగత్ రారు మాట్లాడుతూ ఆధార్ నివాసులందరికీ ఇస్తారనీ, ఓటు సిటిజన్లందరికీ ఇస్తారని తెలిపారు. బీఎస్పీ ఎంపీ రితీష్ పాండే మాట్లాడుతూ ఈ బిల్లు
ఓటు హక్కును హరిస్తుందని అన్నారు. ఆధార్ అనుసంధానం అయితే, గుత్తాధిపత్యం పెరుగుతుందని దుయ్యబట్టారు. ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ మాట్లాడుతూ వ్యక్తిగత గోప్యత చాలా ముఖ్యమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెబుతుందన్నారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఓటర్ కార్డులకు ఆధార్ లింక్ చేస్తే, గోప్యత హక్కు కోల్పోతామని, ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులను హరించేలా చట్టాలను చేసే అధికారం పార్లమెంట్‌కు లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ఆధార్ అనేది కేవలం నివాసం (రెసిడెంట్) ప్రూఫ్ అని, ఓటర్ కార్డు ప్రూఫ్ ఆఫ్ సిటిజన్ షిప్ అని తెలిపారు. దేశంలో కేవలం సిటిజన్లు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తారనీ, ఈ బిల్లు వల్ల ఆధార్ అనుసంధానం పేరుతో నాన్ సిటిజన్లకు కూడా ఓటు ఇస్తారని విమర్శించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసి మాట్లాడుతూ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని అన్నారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ద్వారా సంభవించిందనీ, ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేస్తే రాజ్యాంగం ప్రక్రియ స్వతంత్రతపైనా ప్రభావం చూపుతుందని అన్నారు. అసదుద్దీన్ ఒవైసి ఏకంగా ఓటింగ్‌కు డిమాండ్ చేశారు. అయితే ప్యానల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. సభ ఆర్డర్లో లేదు. ఓటింగ్ అనుమతించలేమని చెప్పారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలన్నీ నిరాధారమైనవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించటంలేదని అన్నారు. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు రిజిస్టర్ చేసుకోవాలని ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 17 స్పష్టం చేస్తుందని అన్నారు. కానీ బోగస్ ఓట్లు ఆగిపోవాలని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ బిల్లు తీసుకొస్తున్నామనీ, ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం దేశ ప్రయోజనాల్లో భాగమే అని అన్నారు. ప్రతిపక్షాల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను మద్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన 17 నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్యానల్ స్పీకర్‌గా కీర్తి ప్రేమ్‌జీబాయి సోలంకి వ్యవహరించగా, ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. సప్లమెంటరీ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ చర్చ ముగియడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇచ్చారు. అనంతరం సప్లమెంటరీ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌ను మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం ద్రవ్య వినిమయం బిల్లును ప్రవేశపెట్టారు. దాన్ని వెంటనే ముజువాణి ఓటుతో ఆమోదించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ బయోలాజికల్ డైవర్సిటీ (సవరణ) బిల్లును తదుపరి పరిశీలన కోసం సంయుక్త కమిటీకి పంపుతున్నామనీ, ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉంటారని తెలుపుతూ వారి పేర్లను ప్రకటించారు. ఈ కమిటీ రిపోర్టును వచ్చే పార్లమెంట్ సమావేశాల మొదటి వారం చివరి రోజు లోపు సభకు అందించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం సభ 2:45 గంటల వరకు వాయిదా వేశారు.
తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (6.1 నిమిషాలు) ఎన్నికల చట్టాలు సవరణ బిల్లును చర్చకు పెట్టారు. కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి (37 సెకన్లు) మాట్లాడుతూ ''ఈ బిల్లు ఈ రోజే ప్రవేశపెట్టారు. ఈ రోజే ఆమోదించుకుంటున్నారు. తాము ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నాం'' అని అన్నారు. బీజేపీ ఎంపి నిషికాంత్ దుబే (1.59 నిమిషాలు) తమ ప్రభుత్వం తీవ్రమైన సంస్కరణలు తీసుకొస్తుందని తెలిపారు. ఆధార్‌ను తామే తీసుకొచ్చామని కాంగ్రెస్ చెబుతుందని, తాము ఆధార్‌కు ఓటర్ కార్డు లింక్ చేస్తున్నామని, దానిలో అన్యాయమేముందని అన్నారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనార్జీ (55 సెకన్లు) మాట్లాడుతూ ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపుతామని చెప్పారని, కానీ ఇప్పుడు బిల్లును హఠాత్తుగా తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడుతుందనీ, అయితే ఈ బిల్లును వెనక్కి తీసుకొని, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎలక్టోరల్ బాండ్లు వంటి అంశాలతో కూడిన మొత్తం ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (48 సెకన్లు) సవరణలు ప్రతిపాదించడం సభ్యుల ప్రాథమిక హక్కు అని, సభ్యులకు కనీసం సవరణలు ప్రవేశపెట్టడానికి కూడా లేకుండా చేశారని విమర్శించారు. ఐయూఎంఎల్ ఎంపీ ఈటి మహ్మద్ బషీర్ (19 సెక్లను), డీఎంకే పక్షనేత టిఆర్ బాలు (23 సెకన్లు), శివసేన ఎంపీ వినాయక్ భౌవురావు రౌత్ (47 సెకన్లు) మాట్లాడారు. వైసీపీ ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు (54 సెకన్లు), బీఎస్పీ ఎంపీ రీతిష్ పాండే (36 సెకన్లు), ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసి (50 సెకన్లు), చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (8.18 నిమిషాలు) సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నాయనీ, అయితే ఇదే అంశాన్ని స్టాండింగ్ కమిటి కూడా ప్రతిపాదించిందని అన్నారు. అనంతరం ప్యానల్ స్పీకర్ కీర్తి ప్రమ్జీభాయి సోలంకి బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు ప్రకటించారు. తరువాత సభను నేటీ (మంగళవారం)కి వాయిదా వేశారు.