Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 నిమిషాల్లో రూ.10 లక్షల కోట్లు ఆవిరి
- సెన్సెక్స్ రెండో రోజూ భారీ పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డ్ బుడగ పేలి పోతుంది. దలాల్ స్ట్రీట్‌లో బేర్ పట్టు బిగుస్తోంది. గత వారమూ భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. సోమవారం భారీ పతనాన్ని చవి చూసింది. ఒమిక్రాన్ భయాలకు తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడం మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. ఈ పరిణామాలతో బిఎస్ఇ సెన్సెక్స్‌లో ట్రేడింగ్ ప్రారంభంలోనే కేవలం 10 నిమిషాల్లోనే రూ.10 లక్షల కోట్లు ఆవిరయ్యింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగాయి.
మొదట్లో భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రా డేలో మరింత దిగజారాయి. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొంతమేరకు తేరుకుని నష్టాల భారాన్ని తగ్గించాయి. తుదకు సెన్సెక్స్ 1,189.73 పాయింట్లు లేదా 2.09 శాతం కోల్పోయి 55,822కి పడిపోయింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఏకంగా 1,879 పాయింట్లు పతనమై 55,133 కనిష్ట స్థాయికి దిగజారింది. అయినప్పటికీ ఒక్క పూటలోనే మదుపర్లు రూ.6.8 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. వరుసగా రెండు సెషన్లలో బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ ఏకంగా రూ.11,45,267 కోట్లు ఆవిరై రూ.2,52,57,581 కోట్లకు పడిపోయింది. ఈ దెబ్బతో రిటైల్ మదుపర్లు బోరుమన్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 371 పాయింట్లు క్షీణించి రూ.16,614కు పడిపోయింది. అన్ని రంగాల షేర్లు నేల చూపులు చూశాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 3 శాతం మేర క్షీణించాయి.
ప్రధాన కారణాలు
ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లకు ఊరటనిచ్చే అంశాలేవీ లేకపోవడం ఓ ప్రధాన కారణంగా ఉంది. మరోవైపు మదుపర్లను ఒమిక్రాన్ భయాలు తీవ్రంగా వెంటాడాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలను కొనసాగించారు. యూరోప్ దేశాల్లో మరోమారు లాక్డౌన్ విధించే అవకాశాలు ఉండటంతో ప్రపంచ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావం భారత సూచీలపై పడింది. మరోవైపు వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం ఆర్థిక వ్యవస్థలపై అనుమానాలను పెంచాయి.