Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగాలాండ్ అసెంబ్లీ తీర్మానం
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో అమాయక పౌరుల మరణానికి కారణమవుతున్న సైనిక బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగాలాండ్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ఏఎఫ్ఎస్పీఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నాగాలాండ్‌లో నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసీవ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తోంది. సోమవారం నాటి అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినదని సమాచారం. తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారని తెలిసింది. పౌరుల మరణాలకు కారణమైన సైనిక అధికారులపై విచారణ జరపాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. నవంబర్‌లో మాన్ జిల్లాలో సైనిక బలగాల కాల్పుల్లో 14మంది అమాయక పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశం యావత్తు ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక బలగాల తీరుపై ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనను నాగాలాండ్ అసెంబ్లీ ఖండించింది. సైన్యంలోని 21 పారా స్పెషల్ ఫోర్స్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిందని నాగాలాండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నివేదికలో పేర్కొన్నారు. సాధారణ పౌరులపై సైన్యం ఉద్దేశపూర్వకంగా కాల్పులకు దిగిందని ఆరోపణలు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర సంఘాల కార్యకర్తలు వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. అయితే ఈ చట్టం రద్దు కావాలంటే అది కేంద్రం చేతిలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపంమేరకు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.