Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో తీరు
- వేతనం పెంచాలని పార్లమెంటరీ కమిటీల సిఫారసు
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. వస్తున్న ఆదాయాలు సరిపోవటం లేదని దేశప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజనం వండివార్చే వారికి నెలకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారంటే నమ్ముతారా..! కానీ ఇది నిజం.2009 నుంచి నెలకు కేవలం వెయ్యి రూపాయలే వేతనం పొందుతున్నట్టు గుర్తించిన పార్లమెంట్ కమిటీ..వారి వేతనాలు పెంచాలని సిఫారసు చేసింది. దీనిపై మోడీ ప్రభుత్వం ఏమాత్రం దృష్టిపెట్టడంలేదు. యూపీ ఎన్నికల్లో ఎలా గెలవాలన్న తాపత్రాయం తప్ప బీజేపీ సర్కార్‌లో ఇంకేదీ కనిపించటంలేదు.
కుక్ కమ్ హెల్పర్లు ఎంతమంది ఉన్నారంటే..
దేశంలోని 24.95 లక్షల మంది కుక్-కమ్-హెల్పర్లు ఉంటే.. దాదాపు 65 శాతం మంది మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్నారు, ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చి పీఎం పోషణ్‌గా మార్చారు. అయితే ఇప్పటికీ వారికి నెలకు రూ. 2,000 కంటే తక్కువ జీతం చెల్లిస్తున్నారు. ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఈ ఉద్యోగులు 2009 నుంచి నెలకు కేవలం రూ. 1,000 జీతం పొందుతుండటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ , ఒడిశా రాష్ట్రాల్లోని ఈ ఉద్యోగుల నెలవారీ జీతం సంవత్సరాలుగా స్వల్పంగా పెరిగినప్పటికీ, రికార్డులు పరిశీలిస్తే...రూ. 2,000 కంటే తక్కువగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలు వంట మనుషులకు, హెల్పర్లకు నెలకు రూ.21,000, రూ.12,000, రూ.9,000 చొప్పున వేతనాలు చెల్లించడంలో ముందున్నాయి.
సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారి సమాచారం ప్రకారం.. విద్యా మంత్రిత్వ శాఖ 2018 , 2020లో జీతాలు రూ. 2,000 పెంచాలని సూచించింది, అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. అవసరాలు, డిమాండ్ల ఆధారంగా రాష్ట్రాలు తమ జీతాలను పెంచాలంటూ కేంద్రం చేతులు దులుపుకున్నది.
''కుక్‌లు, సహాయకులు సామాజిక సేవ చేసే గౌరవ కార్యకర్తలుగా గుర్తిస్తారు'' అని అధికారి తెలిపారు. వారు కార్మికులుగా పరిగణిస్తారు. అందువల్లే వారికి కనీస వేతన చట్టాలు వర్తించవని అంటున్నారు.ప్రధాన మంత్రి పోషణ్ యోజన కింద పనిచేసే కుక్‌లు, కార్మికులకు చెల్లింపులను కేంద్రం, రాష్ట్రం,యూటీలు 60:40 నిష్పత్తిలో ఇస్తున్నాయి.
గత మార్చినెలలో.. రాజ్యసభ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక సమర్పించింది. ''వివిధ రాష్ట్రాలు కుక్-కమ్-అసిస్టెంట్లకు చెల్లించే గౌరవ వేతనంలో వ్యత్యాసం ఉన్నది'' అని పేర్కొంది . వండించే వారికి (కుక్) జీతాలను నిర్ణయించడానికి ఏకరీతి వ్యవస్థను అభివృద్ధి చేయాలని సిఫారసు చేసింది.2020 సంవత్సరంలో రాజ్యసభ నియమించిన మరొక స్టాండింగ్ కమిటీ కూడా ఇదే విధమైన సిఫారసు చేసింది.మధ్యాహ్న భోజన పథకం కింద పని చేస్తున్న వారికి సకాలంలో వేతనాలు చెల్లించడం లేదనే సమస్య చాలాసార్లు తలెత్తిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 3.93 లక్షల మంది కుక్-హెల్పర్లకు జీతం ఇవ్వలేదు. ఆ తర్వాత ఈవిషయం విద్యా మంత్రిత్వ శాఖకు చేరింది. ఇది ఇంకా పరిష్కారదశలోనే ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.