Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమకారులకు అభినందన సభలో ఏచూరి
- అదానీ, అంబానీల కోసమే ప్రభుత్వ విధానాలు
- మోడీ తన డిమాండ్‌ను తానే మరిచిపోయాడు
న్యూఢిల్లీ : చారిత్రాత్మక రైతు ఉద్యమం యావత్తు దేశాన్నే ప్రభావితం చేసిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కొత్త ఒరవడిని సృష్టించిందనీ, అన్ని వర్గాల ప్రజలనూ ఒక్కతాటిపైకి తెచ్చిందన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన రైతులకు అభినందన సభ మంగళవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో జరిగింది. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభకు ఆ సంఘ అధ్యక్షుడు అశోక్ ధావలే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న సీతారాం ఏచూరి మాట్లాడుతూ మోడీ సర్కార్ కార్పొరేట్ లాబీలో భాగంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు మాత్రమే వ్యతిరేకం కాదనీ, యావత్తు దేశానికే వ్యతిరేకమన్నారు.
అలాగే ఆ చట్టాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తీసుకొచ్చారనీ, వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమనీ, కానీ మోడీ సర్కార్ మొండిగా చట్టాలు చేసిందని విమర్శించారు. మోడీ సర్కార్ తెచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం మహోన్నతమైనదని తెలిపారు. ప్రపంచంలోనే శాంతియుతంగా ఇంత సుదీర్ఘంగా ఉద్యమాన్ని కొనసాగించటం భవిష్యత్ పోరాటానికి దిక్సూచి అని తెలిపారు.
అదానీ, అంబానీల కోసం మోడీ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నదనీ, దానివల్ల సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమలు కుప్పకూలిపోతున్నాయని తెలిపారు. దేశ ఆర్థిక నిర్మాణానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలే ముఖ్యమనీ, వాటి ద్వారా ఆర్థిక నిర్మాణం పటిష్టంగా జరుగుతుందని తెలిపారు. మోడీ సర్కార్ అడ్డగోలుతనానికి రైతులు సవాల్ విసిరి నిలబడ్డారనీ, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని నడిపారని వివరించారు. అనివార్యంగా వివిధ ప్రాంతీయ పార్టీలు రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చారని తెలిపారు. రైతు ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇచ్చిందనీ, భవిష్యత్తులో కూడా రైతులు నిర్వహించే పోరాటాలకు తమ పార్టీ బాసటగా నిలుస్తుందని తెలిపారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ రైతాంగానికి వ్యవసాయ కార్మికులు, కార్మికులతో సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. కార్పొరేట్ల విధానాలపై పోరాటం కొనసాగుతుందనీ, అలాగే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కోసం కూడా పోరాటం జరుగుతుందని అన్నారు. ఈ రైతు ఉద్యమంలో దేశంలోని రైతు సంఘాలను ఏకం చేసిందని, అన్ని రాష్ట్రాల రైతులను ఐక్యం చేసిందని తెలిపారు. రైతు వర్గం సంకల్పాన్ని స్పష్టం చేసిందని, బలాన్ని సమాజానికి చూపించిందని అన్నారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) భవిష్యత్తులోనూ కొనసాగుతుందనీ, వివిధ రైతు సమస్యలపై ఎస్కేఎం చర్చిస్తుందని అన్నారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలనన్నింటినీ అమ్మేందుకు ప్రయత్నం జరుగుతుందనీ, అందులో భాగంగానే మానిటైజేషన్ విధానం తీసుకొచ్చారని తెలిపారు. కార్పొరేట్లకు దేశంలోని రోడ్లు, రైళ్లుతో సహా అన్ని సంస్థలు అమ్మేస్తారనీ, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరం ఐక్యంగా లేబర్ కోడ్లు, ప్రయివేటీకరణ, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ రైతు ఉద్యమంలో ఎర్ర జెండా నిర్మాణాత్మక పాత్ర పోషించిందని అన్నారు.
ఈ ఉద్యమంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. ఇది రైతు ఉద్యమ విజయం మాత్రమే కాదని, దేశంలోని అన్ని వర్గాల ప్రజల విజయమని అన్నారు. ఐద్వా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ ఉద్యమంలో మహిళలు అగ్రభాగాన ఉన్నారనీ, వివిధ సరిహద్దు ప్రాంతాల్లో మహిళలు నెలలు తరబడి పాల్గొన్నారని గుర్తుచేశారు. రైతు ఉద్యమానికి ఐద్వా మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో విజూ కృష్ణన్, కృష్ణ ప్రసాద్, ఎన్ కె శుక్లా (ఏఐకేఎస్), ఇంద్రజిత్ సింగ్, సుమిత్ (హర్యానా), చంగల్ లాల్, పేమా రామ్ (రాజస్థాన్), డిపి సింగ్ (ఉత్తరప్రదేశ్), మేజర్ సింగ్ పునివాలా (పంజాబ్), గంగాధర్ నేటియా (ఉత్తరాఖండ్), రామనారాయణ్ కురారియా (మధ్యప్రదేశ్), ఎఆర్ సింధూ, స్వదేశ్ దేబ్రోరు, కరుమలయన్, జెఎస్ మజుంధర్ (సీఐటీయూ), విక్రమ్ సింగ్ (ఏఐఏడబ్ల్యూయూ), ఎస్. పుణ్యవతి, జగ్మతి సంగ్వాన్, ఆశాశర్మ, సర్బానీ సర్కార్ (ఐద్వా), ఎఎ రహీమ్ (డీవైఎఫ్ఐ), మయూక్ బిశ్వాస్, విపి సాను (ఎస్ఎఫ్ఐ) తదితరులు పాల్గొన్నారు.