Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం
న్యూఢిల్లీ : తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యా రు. ఈసందర్భంగా అమిత్‌షా.. తెలంగాణ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు విషయయంలో టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని చెప్పారు. తెలంగాణకు చెందిన ఆ పార్టీ నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నాయకులకు ఆయన సూచనలు చేశారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని షా అభినందించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై దీటుగా స్పందించి వాటిని తిప్పికొట్టాలని బీజేపీ నాయకులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు నిర్వహించిన పాదయాత్ర వంటి కార్యక్రమాలను రాష్ట్ర అధినాయకత్వం చేపట్టాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్టు తెలంగాణ బీజేపీ నాయకులకు అమిత్ షా తెలిపారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన కోరారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజరు, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్ తో సహా పలువురు తెలంగాణ నాయకులు హాజరయ్యారు.