Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : అసోంలోని బీజేపీ ప్రభుత్వం పశుసంరక్షణ చట్టంలో సవరణలకు ప్రతిపాదించింది. ఈ మేరకు 'అసోం పశుసంరక్షణ చట్టం, 2021'లో సవరణలను ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ చట్టం వచ్చిన నాలుగు నెలలకే హిమంత విశ్వ శర్మ ప్రభుత్వం ఇందులో మార్పులకు దిగడం గమనార్హం. తాజా సవరణలతో వ్యవసాయం, సంబంధిత అవసరాల కోసం పశువుల అంతర్-జిల్లా రవాణాకు అనుమతి లభిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించినవారికి కఠిన శిక్షలు పడేలా సవరణలున్నాయి. అలాగే, వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత దర్యాప్తు అధికారులకు అధికారాన్ని కల్పించనున్నాయి. సరైన పత్రాలు లేకుండా పశువుల రవాణాను ఈ చట్టం అంతకముందు నిషేధించింది. అలాగే, తాజా సవరణతో అంతర్జాతీయ సరిహద్దు ఉన్న జిల్లాలకు పశురవాణా అనుమతులు ఉండవు. చట్టంలో చేసిన సవరణల గురించి అసెంబ్లీలో సీఎం హిమంత విశ్వ శర్మ వివరించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత సంబంధిత ఏజెన్సీలు, వ్యవసాయ సంస్థలకు పశురవాణాకు సంబంధించిన అనుమతులిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప పశువధను నిషేధించే ప్రాథమిక చట్టంలోని నిబంధననూ తొలగిస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడం గమనార్హం.