Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లలో మూడోసారి
- యోగి ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమంటున్న ఉద్యోగులు
లక్నో : అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమ్మెకు దిగుతామని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు హెచ్చరించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా) 1981ను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆదివారం నుంచి ఆరు నెలల పాటు సమ్మెలపై నిషేధం ఉంటుంది. ఎస్మా నోటిఫికేషన్ను రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రెటరీ దేవేష్ కుమార్ చతుర్వేది విడుదల చేశారు. 'ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలతో సంబంధ ఉన్న పబ్లిక్ సర్వీస్, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో సమ్మె నిషేధించబడింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి' అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎస్మా ప్రకారం సాధారణ జీవితాన్ని కొనసాగించడానికి ముఖ్యమైన అవసరమైన సేవల్లో ఉన్న ఉదోగ్యులు సమ్మె చేస్తున్నా లేదా పని చేయడానికి నిరాకరించినా వారిపై చర్య తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడయితే ఉద్యోగులను వారెంట్ లేకుండా పోలీసులు అరెస్టు చేయవచ్చు. ఈ చట్టం ప్రకారం ఒక సంవత్సరం, ఆపై వరకూ తప్పనిసరిగా జైలు శిక్ష లేదా రూ.1,000 జరిమానా లేదా పై రెండూ విధించే అవకాశం ఉంది. ఎస్మాను ప్రయోగించడం యోగి ప్రభుత్వానికి ఇదే మొదటిసారి కాదు. కోవిడ్ కేసులు విజృంభిస్తున్న సమయం మేలోనూ ఎస్మాను తీసుకొచ్చింది. అదే ఏడాది నవంబర్లో మరో ఆరు నెలలు పొడిగించారు. ఎస్మాను పొడిగించడంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సమ్మెలపై నిషేధం విధించడాన్ని 'రాజ్యాంగ వ్యతిరేకం' అని రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ కౌన్సిల్ అభివర్ణించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఏ ప్రభుత్వమూ లాక్కోకూడదని కౌన్సిల్ అధ్యక్షులు హరికిషోర్ స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను లేవనెత్తకుండా చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించిందని విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించకుండా యోగి అభినవ నీరో లాగా ప్రవర్తిస్తున్నారని ఉత్తరప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ విమర్శించింది. ఈ నెల 1న రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షర్లు, శిక్షా మిత్రలు, అంగన్వాడీ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, మధ్యహ్న భోజన కార్మికులు ఒక రోజు సమ్మె నిర్వహించారు.