Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న వాతావరణ మార్పు ప్రమాదాలు
- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 4.7 ట్రిలియన్ డాలర్ల నష్టం..
న్యూఢిల్లీ : అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం కొనసాగుతుండటం, కాలుష్యం పెరుగుదల వంటి కారణాలతో వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని ప్రభావం మానవాళితో పాటు భూమిపై ఉన్న జంతుజాలంపైనా అధికంగా ఉంటున్నది. ప్రస్తుత చర్యల కారణంగా భూతాపం పెరుగుతున్నదనీ, దిని కారణంగా వాతావరణ ప్రమాదాలు అధికం అవుతున్నాయని 'ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్' నివేదిక పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్ పెరుగుదల వ్యత్యాసం 1.5 నుంచి 2 డిగ్రీల సంభావ్యతతో ఉందనీ, ప్రకృతి విపత్తులు పెరిగే అవకాశం అధికంగా ఉందని ఈ నివేదిక నొక్కి చెప్పింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వాతావరణ ప్రమాదాల కారణంగా సంభవించే నష్టాలు 1.2-4.7 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది. తక్కువ అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పసిఫిక్ పరిధిలోని అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీపాలు ఎక్కువగా నష్టపోయే అకాశముందని తెలిపింది. ఈ ప్రభావాలను తగ్గించడానికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు కీలకమని బ్యాంకాక్ యూఎన్-ఈఎస్సీఏపీ విపత్తు ప్రమాదాల తగ్గింపు విభాగం చీఫ్ డాక్టర్ సంజరు శ్రీవాస్తవ అన్నారు. మడ అడవులు ఉష్ణ మండల తుఫానులు, తుఫాను ఉప్పెనలు, తీర ప్రాంత వరదలు-కోత ప్రభావాలను తగ్గిస్తాయని దానికి ఉదాహరణ పేర్కొన్నారు.
మడ అడవులు లేకుండా జరిగే విపత్తు నష్టాల అంచనాలు భారత్లో 11 బిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్లో 2.25 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్లో 0.18 బిలియన్ డాలర్లుగా ఉన్నవాటికంటే గణనీయంగా పెరుగుతాయి. గ్లాస్కోలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు సైతం భూతాపాన్ని తగ్గించడంపై చర్చించింది. ఇందులో భాగంగా దాదాపు 90 శాతం అడవులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 120కి పైగా దేశాలు 2030 నాటికి అటవీ నిర్మూలన చర్యలను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేయడం ఒక మైలురాయిగా చెప్పవచ్చు. అయితే, ప్రపంచంలోని పెద్ద దేశాల కొనసాగిస్తున్న ప్రకృతి వినాశన చర్యలు యావత్ ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తున్నదని ఇప్పటికే అనేక నివేదికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. యూఎన్-ఈఎస్సీఏపీ నివేదిక ప్రకారం.. గాలి వేగం గంటకు 180-250 కిలో మీటర్ల వరకు తుఫానులను ఎదుర్కొనే ప్రమాదంలో కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి. కానీ భూతాపం 1.5 డిగ్రీలు వేడెక్కడం కారణంగా పసిఫిక్ ప్రాంతాలోని చాలా ప్రాంతాలు మరింత బలమైన గాలులు, తుఫానులను ఎదుర్కొనే ప్రమాదం అధికంగా ఉంది. పర్యావరణంపై పడుతున్న ప్రభావంతో గత 200 ఏండ్లలో మౌలిక సదుపాయాల కల్పన కంటే అధికంగా రాబోయే 20 ఏండ్లలో చేయాల్సివుంటుందని పేర్కొంది.