Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన ప్రాంతాల్లో పోషకాహారలోపంపై బాంబే హైకోర్ట్
న్యూఢిల్లీ : గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమస్యను పరిష్కరించడానికి స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో మేల్గాట్ గిరిజన ప్రాంతంలో చిన్న పిల్లలు, గర్భిణులు, ప్రసవ మహిళలు పోషకాహారలోపంతో మరణించటం సంచలనం సృష్టించింది. దీనిపై 2007లో పదుల సంఖ్యలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు తాజాగా పై వ్యాఖ్యలు చేసింది. గిరిజన ప్రాంతంలో పోషకాహారలోపం సమస్యపై సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఛెరింగ్ డోర్జే రూపొందించిన నివేదికను సోమవారం కోర్టులో సమర్పించారు. సమస్యను పరిష్కరించడానికి సమగ్రమైన ప్రణాళికను తీసుకురావాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు. నివేదికలోని అంశాలపై వివిధ ప్రభుత్వ విభాగాల అభిప్రాయాన్ని తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. స్వల్పకాలిక ప్రణాళికతో తమ ముందుకు రావాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, కేసు విచారణను జనవరి 3కు వాయిదా వేసింది.