Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్‌లో గిరిజనుల వ్యతిరేకత
- హేమంత్ సర్కారు నిర్ణయంపై నిరసన
రాంచీ : జార్ఖండ్‌లో సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎదురుగాలి వీస్తున్నది. గిరిదిV్‌ా జిల్లాలోని మోహన్పూర్ గ్రామ గిరిజనులు హేమంత్ సొరేన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో కొండ ప్రాంతమై మోహన్పూర్ గ్రామంలో సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే ఇది ఇప్పుడు అక్కడి ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. పోలీసుల వేధింపులు, కఠిన చర్యలు.. సీర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేస్తే మరింత ఎక్కువయ్యే ప్రమాదమున్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వారు భద్రతా బలగాలతో తమకు గతంలో ఎదురైన అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు.
'' సోదాల పేరుతో పోలీసులు తరచూ మా ఇండ్లలోకి వస్తారు. మమ్మల్ని కొడతారు. దూషిస్తారు. తీవ్రవాదులు, మావోయిస్టులనే ముద్ర వేస్తారు. అందుకే, ఇక్కడ సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం'' అని గ్రామస్థుడు అర్జున్ మరాండీ తెలిపారు. '' ప్రభుత్వం ఇక్కడ సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేస్తుందన్న విషయం ఈనెల 17న మాకు తెలిసింది. గ్రామ పంచాయతీకి ప్రతి విషయంలో ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వం తన నినాదంలో వినిపించింది. అయితే, ఈ విషయం గురించి మాత్రం గ్రామ పంచాయతీతో చర్చించలేదు'' అని తెలిపారు. సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తాము రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతామనీ, అంతటితో ఆగకుండా గవర్నర్ నివాసాన్నీ ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. ''మా ప్రాంతంలో ప్రభుత్వం రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు నిర్మించాలని కోరుకుంటున్నాం. దీంతో మా చిన్నారులు విద్యావంతులవుతారు. ప్రజలకు వైద్య సదుపాయం లభిస్తుంది'' అని మరో గ్రామస్థుడు రంజిత్ హెంబ్రాం తెలిపారు.
సీఆర్పీఎఫ్ క్యాంపుల ఏర్పాటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2016లో ప్రారంభమైంది. ఆ సమయంలో రఘుబర్‌దాస్ సీఎంగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు మందు హేమంత్ సొరేన్ ప్రతిపక్ష నాయకుడిగా గిరిదిV్‌ా ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ పోలీసు క్యాంపుల ఏర్పాటుకు అనుమతించేది లేదని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం సీఎంగా ఉన్న హేమంత్ సొరేన్ ఆ వాగ్దానాన్ని మరిచి సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం సరికాదని ఇక్కడి స్థానికులు, గిరిజనులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.