Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారణాసిలో బీజేపీ వరుస యాత్రలు
- కొత్త రోడ్లు, నగర సుందరీకరణపై యూపీ అంతటా ప్రచారం
- ఇంధన ధరలు, ఉపాధి సమస్యలపై మాట్లాడని బీజేపీ నాయకులు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నవేళ అక్కడ అధికార బీజేపీ నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తామా? రామా? అనే అనుమానం వారిని వెంటాడుతోంది. చేసిన అభివృద్ధి కన్నా..మతపరమైన యాత్రల గోల ఎక్కువగా కనపడుతోంది. ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో యాత్రల హడావిడి సంగతి చెప్పక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగటం, ఉపాధి, ఉద్యోగాల సమస్య, వంటగ్యాస్ ధరలు పెంచటంపై బీజేపీ మాట్లాడటం లేదు. హిందూత్వ ఓటు బ్యాంకును ప్రభావితం చేయటమే లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ ముందుకు వెళ్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీలో ప్రారంభమైన 'అన్నపూర్ణా శోభాయాత్ర' నవంబర్ 15న వారణాసిలో ముగిసింది. 'మా అన్నపూర్ణ' విగ్రహ ప్రతిష్టకు 100ఏండ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ నాయకులు ఈ యాత్రను చేపట్టారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన జిల్లాలన్నింటినీ తాకుతూ ఈ యాత్ర సాగింది. ఘజియాబాద్, బులంద్‌షహర్, ఉన్నావో, అలీఘర్, అయోధ్య..మొదలైన 18 జిల్లాల్లో యాత్ర నిర్వహించారు. వారణాసిలో జరిగిన ముగింపు కార్యక్రమంలో సీఎం యోగి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ఇలాంటి యాత్రలతో కాలం వెళ్లబుచ్చుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వారణాసి సుందరీకరణ చూపి..మత రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని, నిరుద్యోగం, అధిక ధరలు ఎవరు పరిష్కరిస్తారో చెప్పటం లేదని ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్, కొత్తగా వేసిన రోడ్లను చూపి బీజేపీ యూపీ అంతటా ఓట్లు అడుగుతోంది. నిజానికి వారణాసిలో చిన్న చిన్న వ్యాపారులు, పేద, మధ్య తరగతి, కార్మికులు సంతోషంగా లేరు. వారి జీవన పరిస్థితులు ఏమాత్రమూ మెరుగుపడలేదు. దీనిగురించి స్థానికుడు సోనూ ధర్మేంద్ర మాట్లాడుతూ, ''వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయని రేషన్ దుకాణాల్లో పప్పు, నూనె ప్యాకెట్లు ఇస్తున్నారు. ఎన్నికలు ముగిసాక ఇది ఆగిపోతుందని మాకు తెలుసు. ఐదుగురు సభ్యులున్న మా కుటుంబానికి కావాల్సింది ఉపాధి. తక్కువ ధరల్లో నిత్యావసర సరుకులు. ఇవన్నీ పక్కకుపెట్టి నగర సుందరీకరణ, పార్కులు, కారిడార్లు చూపుతూ అభివృద్ధి అంటున్నారు'' అని ఎద్దేవా చేశారు.