Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ఆరునెలల్లో పెరిగిన ధరల ఫలితం
- భారత్‌లో 58 శాతం మంది పట్టణ ప్రజల అభిప్రాయం
- ప్రపంచవ్యాప్తంగా 59శాతం మంది వెల్లడి : గ్లోబల్ సర్వే
న్యూఢిల్లీ : దేశంలో పెరిగిన నిత్యవసరాల ధరలు ప్రజలపై ఆర్థికంగా భారం మోపుతున్నాయి. గత ఆరు నెలల్లో తాము నిత్యవసర వస్తువులు, సర్వీసులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సివచ్చినట్టు 58 శాతం మంది పట్టణ భారతీయులు వెల్లడించారు. వీటిలో రవాణా, హౌజింగ్, ఫుడ్ అండ్ డ్రింక్స్, వస్త్రాలు, ఆరోగ్యంతో పాటు ఇతరాలు ఉన్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో 30 దేశాలలో 20,504 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. ద్రవ్యోల్బణం రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని సర్వేలో అడిగారు. ఈ సర్వేను నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 మధ్య నిర్వహించారు.
ఈ సంస్థ సర్వే ప్రకారం.. పట్టణ భారతీయుల్లో ప్రతి పది మందిలో ఆరుగురు (58 శాతం మంది), ప్రపంచవ్యాప్తంగా 59 శాతం మంది గత ఆరు నెలల్లో నిత్యవసర వస్తువులపై అధికంగా చెల్లించినట్టు తెలిపారు. భారతీయుల్లో 55 శాతం మంది, అలాగే, ప్రపంచంలో 42 శాతం మంది రాబోయ మూడు నెలల్లో ఇంటి ఖర్చులు పెరిగే అవకాశమున్నదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ద్రవ్యోల్బణం పెరగకుండా ఉంచేందుకు ఒమిక్రాన్‌ను కట్టడి చేయడం, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను తొలగించడం ప్రస్తుతమున్న లక్ష్యమని ఇప్సోస్ ఇండియా సీఈఓ అమిత్ అడార్కర్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం ఎదుర్కొన్న మార్కెట్లు కలిగిన దేశాలలో అర్జెంటీనా (79 శాతం), కొలంబియా (75శాతం), టర్కీ (75 శాతం), రష్యా (74 శాతం) లు ఉన్నాయి. ఇక జపాన్ (21 శాతం), చైనా (35 శాతం), మలేషియా (41శాతం) దేశాలలో ఈ ప్రభావం తక్కువగా ఉన్నది.
ఇక భారత్‌లో దశాబ్దల-అధిక కమోడిటీ ద్రవ్యోల్బణంతో కంపెనీలు పట్టుబడుతుండటంతో వంట నూనె నుంచి కార్ల వరకు ప్రతీ వస్తువు ధరలూ పెరుగుతున్నాయి. రవాణాపై (గ్యాసోలిన్, కార్ పేమెంట్స్, పార్కింగ్, పబ్లిక్ ట్రాన్సిట్ వంటివి) తాము అత్యధికంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని 63 శాతం మంది పట్టణ భారతీయులు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆహారం, కిరాణ సరుకులపై ఆరు నెలల కిందటి పరిస్థితులతో పోల్చుకుంటే అధికంగా వెచ్చించాల్సి వస్తున్నదని 60 శాతం మంది భారతీయులు వెల్లడించారు. ఇక విద్యుత్, గ్యాస్, నీరు, ఫోన్, ఇంటెర్నెట్ వంటి ఇతర అవసరాలపై అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని భారత్‌లోని 60 శాతం మంది పట్టణ ప్రజలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అభిప్రాయం 66 శాతం మందిలో ఉన్నది. ఇక రెంట్, మార్టిగేజ్, మెయింటెనెన్స్ వంటి ఇంటి ఖర్చులపై అధికంగా ఖర్చు చేసినట్టు 50 శాతానికి పైగా భారతీయులు వెల్లడించగా, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. బట్టలు, పాదరక్షలు వంటి వస్తువుల ధరలు కూడా పెరిగాయని ప్రజలు వెల్లడించారు. పట్టణ భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 శాతం మంది ఈ అభిప్రాయాన్ని తెలిపారు.