Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీని కలుస్తామంటే.. కుదరదన్న అధికారులు
- మూడు నెలలుగా జీతాల్లేవు.. ఆకలితో అలమటిస్తున్నాం...
- ప్రయాగ్‌రాజ్‌లో పారిశుధ్యకార్మికుల ఆవేదన
2019.. కుంభమేళాలో పారిశుధ్య కార్మికుల కాళ్ళను ప్రధాని కడిగారు. స్వచ్ఛ భారత్ కింద మీ సేవలు అమూల్యమంటూ వారిపై ప్రశంసలు సైతం కురిపించారు. మోడీ.. కాళ్లు కడిగిన పారిశుధ్య కార్మికుల్లో ఇద్దరు వ్యక్తులు నరేష్కుమార్, ప్యారేలాల్. కాగా, ప్రధాని మంగళవారం యూపీ ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన సభలోపలికి మాత్రం వారిని అనుమతించలేదు. అసలింతకీ వారి బాధేంటీ..? ఎందుకని మోడీని కలవాలనుకున్నారు..?
న్యూఢిల్లీ : యూపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ వస్తుండటంతో.. యోగి సర్కార్ ఎక్కడా చెత్త కనబడకుండా రాష్ట్రమంతా పారిశుధ్య కార్మికులను రంగంలోకి దింపింది. బీజేపీ ప్రచారానికి లోటు లేకుండా చేయటానికి సర్కారు ఖజానా నుంచి కోట్లు గుమ్మరిస్తున్నది. కానీ పారిశధ్య కార్మికుల సమస్యలు వినటానికి మాత్రం బీజేపీ సర్కార్ నిరాకరిస్తున్నది. మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లో మోడీ సభకు హాజరయ్యారు. సభలో ప్రవేశించబోతున్న పారిశుధ్య కార్మికులు నరేష్కుమార్, ప్యారేలాల్‌లను అడ్డుకున్నారు. దీంతో వారి బాధ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ''మోడీ సార్.. మమ్మల్ని మోసం చేశారు. కుంభమేళ-2019లో.. మా కాళ్ళు కడిగారు. ఫొటోలు, మీడియాలో హైలెట్ అయ్యాయి. మా బతుకులు మారిపో తాయనుకున్నాం. పోప్ తరహాలో మోడీ తమ కాళ్లు కడిగిన తీరు రాజకీయ స్టంటే నని ఇప్పుడు అర్థమవుతున్నది. కాళ్లు కడిగితే.. మా కడుపు నిండుతుందా? మూడు నెలలుగా మాకు జీతాలివ్వడం లేదు.
ఆకలి చావుల అంచున ఉన్నాం. ఎంతో కష్టపడి ప్రయాగ్‌రాజ్‌కు నడిచి వచ్చాం. మోడీని స్వయంగా కలిసి మా బాధను చెప్పుకోవాలనుకున్నాం. అధికారులు మాత్రం ప్రధానిని కలవటానికి అనుమతించ లేదు'' అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని పరేడ్ గ్రౌండ్లో మోడీ సమావేశానికి భారీ సంఖ్యలో మహిళల్ని తరలించారు. ఆ వేదికకు 100 మీటర్ల దూరంలో నిల్చొన్న నరేష్ కుమార్, ప్యారేలాల్ కండ్ల ల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. వారిద్దరి వద్ద 'నమామి గంగే' మిషన్ గుర్తింపు కార్డు ఉంది. తమ గుర్తింపు కార్డును కూడా పోలీసులకు చూపించగా... 'మిమ్మల్ని లోపలికి అను మతించర' అంటూ అడ్డుకున్నారు. 2019 కుంభమేళలో మోడీ తమ పాదాలు శుభ్రపర్చారనీ, తమ సేవలను కొనియాడారనీ.. ఒకసారి వెళ్ళి కలుస్తామంటూ.. నరేష్ కుమార్, ప్యారేలాల్లు ప్రాధేయ పడినా లోపలికి వెళ్లనివ్వకపోవడం గమనార్హం. ప్రధాని మోడీని ఐదు నిమి షాలు కలిసేందుకు అనుమతించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను అభ్యర్థించామని నరేష్ కుమార్ తెలిపారు.
''మాబాధను మోడీకి తెలియచేయాలనుకున్నాం. కేవలం అబద్ధాలు పేద లను గౌరవంగా బతకనివ్వవన్న విషయాన్ని మోడీకి చెప్పాల నుకున్నాం. మాకు ఉపాధి కావాలి. మాకివ్వాల్సిన జీతం కావాలి. గత మూడు నెలల నుంచి జీతాలు అందడం లేదు. దీంతో మా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. మా గోస ఎవరికి వినిపించటంలేదు'' అని వివరించారు.
గతంలో 10 వేలు.. ఇప్పుడు 8 వేలే..
గత నాలుగేండ్లుగా గంగా సంగమాన్ని శుభ్రం చేసే పనిలో నిమగమై ఉన్నామని నరేష్ కుమార్ తెలిపారు. ''ఇంతకు ముందు రూ.10 వేలు జీతం వచ్చేది. ప్రస్తుతం దానిని రూ.8 వేలకు తగ్గించారు. గత మూడు నెలలుగా మాకు జీతాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితిల్లో.. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియటంలేదు. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఉద్యోగ భద్రత లేదు. మాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినప్పుడే నిజమైన గౌరవం. జీతం డిమాండ్ చేసినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు'' అని వాపోయాడు.
''గంగా సంగమ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలను శుభ్రపరిచే బాధ్యత కలిగిన సఫాయి కర్మ చారీలకు నమామి గంగే ప్రాజెక్ట్ కింద జీతం అందుతుంది. శుభ్రపరిచే బాధ్యతను విశాల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థకు అప్పగించారు. ఈ క్లీనింగ్ కార్మికులకు గత మూడు నెలలుగా కంపెనీ జీతాలు చెల్లించడం లేదు. తినడానికి తిండిలేక ఆ కుటుంబాలు పస్తులుంటున్నాయి. ప్రస్తుతం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం'' అని స్వీపర్ నరేష్ వాపోయాడు. ''కొద్ది రోజుల పాటు వడ్డీ కట్టారు. ఇపుడు దాన్ని కట్టలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి కొంత అప్పు ఇవ్వాలని అడిగితే వడ్డీ వ్యాపారులు అసలు కట్టాలంటున్నారు. స్వయంగా..ప్రధాని పిలిచి కాళ్లు కడిగితే..మంచి రోజులు (అచ్ఛేదిన్) వస్తాయనుకున్నాం. కానీ పారిశుధ్య కార్మికుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పురాలేదు'' అని కార్మిక సంఘాలు తెలిపాయి.
ప్రధాని మోడీ.. కుంభమేళ 2019లో పారిశుధ్య కార్మి కుల పాదాలను శుభ్రపరిస్తే..ఆకాశానికి ఎత్తారు. ప్రతి పక్షాలు దీన్ని రాజకీయ ఎజెండాగా పేర్కొనగా.. బీజేపీ తెగ ప్రచారం చేసుకున్నది. మోడీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్నా.. సుందరీకరణ పూర్తి కానీ నమో గంగా పథకం కింద పనిచేస్తున్న స్వీపర్ల తలరాతలు మాత్రం మారలేదు.