Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైపవర్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి
- కేంద్రానికి 900 మందికిపైగా నటీనటులు, చిత్రనిర్మాతల లేఖ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని సినీసంస్థలను విలీనంచేయాలనే ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఫిల్మ్స్ డివిజన్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండి యా, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లోని అన్ని శాఖలను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి భారత సినీ పరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విలీన నిర్ణయానికి వ్యతిరేకంగా 900 మందికి పైగా నటీనటులు, చిత్ర నిర్మాతలు సహా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని సభ్యుల బృందం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరే ట్‌తో పాటు ఆయా సంస్థలను నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో విలీనం చేస్తామని మంత్రిత్వ శాఖ గత ఏడాది డిసెంబర్లో ప్రకటించింది. ఇది 2022 జనవరి నెలాఖరులోపు పూర్తికానుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత సినీ పరిశ్రమ నటీనటులు, నిర్మాతలు, ఇతర సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో నటుడు నసీరుద్దీన్ షా, చిత్రనిర్మాత, నటి నందితా దాస్, దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్, రచయిత వరుణ్ గ్రోవర్ వంటి ప్రముఖులున్నారు. ఈ లేఖలో వివరాలు ఇలావున్నాయి.. సినీ సంస్థల పారదర్శకత, సంప్రదింపులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విషయాలను పరిష్కరించే వరకు ప్రభుత్వ సంస్థల విలీనాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ''అత్యంత ముఖ్యమైన ఈ విలీన కసరత్తులో సినీ పరిశ్రమ సభ్యులతో పాటు పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగులు సహా వాటాదారులతో వివరణాత్మక చర్చలు జరుగుతాయని మేం ఆశిస్తున్నాము'' అంటూ లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఈ అంశంపై ఏర్పాటైన బిమల్ జుల్కా ఆధ్వర్యంలోని హై పవర్డ్ కమిటీ ప్రాథమిక వాటాదారులతో సంబంధం లేకుండా తన నివేదికను సమర్పించడం తమను ఆశ్చర్యానికి గురిచేసింది తెలిపింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితమవుతారని ఫిలింస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి మాటలను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. హైపవర్డ్ కమిటీ నివేదికను సమాచార హక్కుచట్టం కింద కోరినప్పటికీ.. ఎందుకు బహిర్గతం చేయలేదు? అని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మొత్తం ప్రక్రియ చట్టబద్ధతపైనా సందేహాలు లేవనెత్తింది. ఈ నిర్ణయం భవిష్యత్తులో సినిమా ఆర్కైవ్‌లు, సంబంధిత ప్రభుత్వ ఆస్తుల ప్రయివేటీకరణకు నాంది అంటూ మీడియాలో వస్తున్న వార్తలను సైతం ప్రస్తావించింది. ''ప్రస్తుతం తలెత్తే అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు భారతీయ సినిమా చరిత్ర, దేశ చిత్రనిర్మాతల భవిష్యత్తును కాపాడేందుకు తక్షణ చర్య తీసుకోవాలని'' ఈ లేఖలో కేంద్రాన్ని కోరారు. సినీ సంస్థలకు సంబంధించిన నిర్ణయాలతో ముందుకెళ్లే ముందు తమ మనోవేదనలను ప్రభుత్వం గమనించాలని కోరారు. అలాగే, హైపవర్ కమిటీ నివేదికను బయటపెట్టాలన్నారు. ఆయా సంస్థల విలీనం కూడా ఆపాలని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై చిత్రనిర్మాతలు, నటీనటులు, ఆయా సంస్థల ఉద్యోగులతో సహా వివిధ వాటాదారులతో సంప్రదింపులు జరపాలనీ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సినిమా సంస్థలు జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని ఈ బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇవి ప్రజాధనంతో నడుస్తున్నాయనీ, ఇది పౌరులకు చెందినదని పేర్కొంది. ఆయా సంస్థల రక్షణకు కట్టుబడి ఉండాలనీ, భవిష్యత్తులో విక్రయించబోమంటూ పార్లమెంటులో రాతపూర్వకంగా హామీని ఇవ్వాలని పేర్కొంది. కాగా, డిసెంబర్ 9న మంత్రిత్వ శాఖ ఈ సంస్థలకు తమ శాఖ కార్యాలయాల మూసివేత కోసం వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరింది.