Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిపాజిట్లు కూడా దక్కని కమలం పార్టీ అభ్యర్ధులు !
- జాతీయ పార్టీల కన్నా అగ్ర స్థానంలో వామపక్ష సంఘటన్
కోల్‌కతా : ఇటీవల ముగిసిన కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) ఎన్నికల్లో బీజేపీ, స్వతంత్ర అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో డిపాజిట్లను కోల్పోయారు. డిపాజిట్ల పరంగా చూసుకుంటే రెండు జాతీయ పార్టీల కన్నా వామపక్ష పార్టీలు మెరుగైన పనితీరు కనబరిచాయి. డిపాజిట్లను కోల్పోయిన అభ్యర్ధుల విషయంలో బీజేపీ అన్నింటికంటే అగ్ర స్థానంలో వుంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ వుంది. మొత్తంగా 116మంది బీజేపీ అభ్యర్ధుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 144 వార్డులకు గానూ 142 వార్డుల్లో అభ్యర్ధులను బీజేపీ నిలబెట్టింది. పోలైన ఓట్లలో ఆరవ వంతు కూడా రాకపోతే సదరు అభ్యర్ధి డిపాజిట్ కోల్పోతాడు. 'ఇది వాస్తవం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ పేలవమైన పనితీరు కనబరిచింది. 2010లో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఒక్క ఎంఎల్ఎ కూడా లేరు. కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డులు గెలుచుకున్నాం. ఈసారి 70మంది ఎంఎల్ఎలు, 17మంది ఎంపీలు వుండి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు సీట్లు కన్నా ఎక్కువ గెలుచుకోవడంలో విఫలమయ్యాం. 2015లో జరిగిన కోల్‌కతా స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఏడు వార్డులను గెలుచుకుంది.' అని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500 చొప్పున, మహిళా అభ్యర్ధులు, ఎస్సీ అభ్యర్ధులైతే రూ.250 చొప్పున డిపాజిట్ చేయాల్సి వుంటుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఓట్ల వాటా పెరిగినందువల్లనే కాషాయ శిబిరం దెబ్బతిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ''గత రెండు ఎన్నికల్లో వామపక్ష సంఘటన ఓటుబ్యాంక్ తుడిచిపెట్టుకుపోవడం బెంగాల్లో బీజేపీ పెరగడానికి కారణమైంది. ఇప్పుడు వామపక్ష సంఘటన గతంలోని తన ఓట్ల వాటాలో కొంత భాగాన్ని రాబట్టుకోవడంతో బీజేపీ దారుణంగా దెబ్బతింది.' అని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుప్రియ దత్తా గుప్తా వివరించారు.
రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
రాజస్థాన్‌లోని నాలుగు పంచాయితీల్లో జరిగిన ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ పార్టీ మెరుగైన రీతిలో సీట్లను గెలుచుకుంది. రైతు ఉద్యమం ప్రభావంతో పంజాబ్ సరిహద్దుల్లో గల శ్రీ గంగానగర్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్, బీజేపీ రెండు జిల్లా పరిషత్‌లను గెలుచుకున్నాయి. కాగా పంచాయితీ సమితుల్లో నాలుగు జిల్లాల్లోని మొత్తం 30స్థానాలకు గానూ కాంగ్రెస్ 14 గెలుచుకుంది. బీజేపీ 8స్థానాలను దక్కించుకుంది. కోట, బరాన్ జిల్లా మండళ్లు బీజేపీ ఖాతాలో పడగా, శ్రీగంగానగర్, కరౌలి జిల్లాలు కాంగ్రెస్‌కు వెళ్ళాయి. 8 పంచాయితీల్లో అటు కాంగ్రెస్ గానీ ఇటు బీజేపీ గానీ స్పష్టమైన మెజారిటీని సాధించలేదు. స్వతంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు.