Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు మందకృష్ణ మాదిగ వినతి
న్యూఢిల్లీ : ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కోరారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను మందకృష్ణ బృందం కలిసింది. తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే విషయంలో చొరవ చూపాలని వినతి అందించారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉండాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు మందకృష్ణ మాదిగ ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ భేటీ జరిగిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి గర్జన పేరుతో ఫిబ్రవరి 12న చలో హైదరాబాద్కు పిలుపు ఇచ్చారు. కేంద్రంపై నిరసనను తెలియచేసేందుకే గర్జన చేస్తున్నామనీ, లక్షలాది మంది విద్యార్థులే లక్ష్యంగా కార్యాచరణ జరుగుతుందని అన్నారు. కేంద్రం మోసం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేంద్రాన్ని నమ్మేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంతో తేల్చుకోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు.