Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆగ్రహం
- కర్నాటకలో నిరసనలు
బెంగళూరు : కాంగ్రెస్ ఎంఎల్ఎల తీవ్ర నిరసనల మధ్య మత మార్పిడి నిరోధక బిల్లును కర్నాటక అసెంబ్లీ మూజువాణీ ఓటుతో గురువారం ఆమోదించింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా పాలక పక్షం గురువారం కర్నాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్, 2021ను సభలో ప్రవేశపెట్టింది. బిల్లుపై దాదాపు ఆరు గంటల పాటు చర్చ జరిగింది. అయినా చర్చకు మరికొంత సమయం కావాలంటూ కాంగ్రెస్ సభ్యులు కోరారు. సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్ష నేత సిద్దరామయ్య మాట్లాడుతూ, 'ఇది ఆర్ఎస్ఎస్ అంతర్గత ఎజెండా' అని వ్యాఖ్యానించారు. దానిపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప తీవ్రంగా స్పందించారు. ఇది దేశ సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకువచ్చిన బిల్లంటూ వ్యాఖ్యానించారు. ''మేం ధర్మాన్ని కాపాడుతాం. ఎవరైనా అడ్డువస్తే ముక్కలుగా నరుకుతాం'' అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాల నుండి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు సభా వేదిక వద్దకువచ్చి ధర్నా చేశారు. గొంతెత్తి నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చేబూని వెల్లోకి దూసుకువెళ్లారు. క్రైస్తవ సంఘాల నేతలు కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈగొడవల మధ్యనే బిల్లును మూజువాణీ ఓటుతో ఆమోదిం చేశారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ, బలవంతంగా మత మార్పిడులు జరిగితే వాటిపై చర్యలు తీసుకునేందుకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి వుందన్నది బహిరంగ రహస్యమేనని అన్నారు. దీని వెనుక ఆర్ఎస్ఎస్వుందనే మీరు 2016లో ముసాయిదాబిల్లును ఎందుకు రూపొందిం చారంటూ ఎదురు ప్రశ్నించారు. సామూహిక మత మార్పిడులకు పాల్పడేవారికి ఇకపై జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలను పొందుపరిచారు. ప్రలోభాలకు గురి చేయడం ద్వారా లేదా బలవంతంగా లేదా మోసపూరితమైన విధానాల ద్వారా మత మార్పిడులు జరగడాన్ని ఈ బిల్లు నిరోధిస్తోంది. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించినట్లైతే వారికి ఐదేళ్ళ జైలుశిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తారు. మైనర్లు, మహిళలు, ఎస్సి, ఎస్టిలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నుండి పదేళ్ళ వరకు శిక్ష పడుతుంది. రూ.50వేల వరకు జరిమానా వుంటుంది. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు.