Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల కోసం వచ్చాం
- నిర్ణయం కోసం పడిగాపులుకాస్తున్నాం
- రైతులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు : కేంద్రంపై మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శలు
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తాము గత ఆరు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అయినా మోడీ సర్కారుకు పట్టటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'మేమేమైనా ప్రేమ లేఖలు రాయడానికి ఇక్కడికొచ్చామని అనుకున్నారా...? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరావు, వెంకటేశ్ నేత, కెఆర్ సురేశ్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, బడుగు లింగయ్య యాదవ్‌లతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఏడాది కాలంగా రైతులు చలిలో, ఎండలో చేసిన ఉద్యమం తమకు ఈ సందర్భంగా గుర్తుకొచ్చిందని తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగానైనా రైతుల కోసం నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్థిరమైన వ్యవసాయ రంగానికి, కొద్దిపాటి ప్రోత్సాహకాలు ఇస్తే ముందుకు సాగుతుందని తెలిపారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన పంటలు పండే పరిస్థితి ఉండబోదని, అన్నిరకాల పంటలు ఎక్కువ దిగుబడితో పండే అవకాశం ఉన్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలో మధ్యలో బీజేపీ నేతలు ఎలా జోక్యం చేసుకుంటారనీ, మాట్లాడటానికి వారెవరని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందని, మంత్రులు రాజకీయ నేతల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అవమానకరంగా మాట్లాడుతున్నారు..
తామేదో పనిలేక ఇక్కడకు వచ్చినట్టు చులకనగా, అవమానకరంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల కోసం వస్తే ఇంత చులకనగా చూస్తారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రకటించిన దాన్నే తాము లిఖితపూర్వకంగా అడుగుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ''కేంద్రం బాయిల్డ్ రైస్ వద్దన్నది. మేం రైతులకు కూడా చెప్పాం. ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు మేం అడిగేది ఖరీఫ్ దిగుబడి అదనపు కొనుగోళ్ల గురించే. రెండ్రోజుల్లో చెబుతాం అన్నారు. అందుకే ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆఫీస్ పనిగంటలు ముగిసే వరకు ఎదురుచూశాం. ఈ లోపు బీజేపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు'' అని ఆరోపించారు.
వ్యవసాయానికి సబ్సిడీ కేవలం 4శాతం మాత్రమే ఇస్తున్నామనీ, దేశంలో 50కి పైగా పంటలు పండితే, కేంద్ర ప్రభుత్వం కేవలం 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధరను ఇస్తుందని ఆయన విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ అందుకే కీలక సిఫార్సులను చేసిందనీ, ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ఆయా సిఫార్సులను అమలు చేస్తామంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. అయితే ఏడేండ్లు గడిచినా చేసిందేమీ లేదని, తెచ్చిన నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. రైతులను వ్యవసాయం చేయొద్దన్నట్టుగా నిరుత్సాహ పరుస్తున్నారని విమర్శించారు. అత్యధిక స్వయం ఉపాధి కలిగిన వ్యవసాయ రంగంపై ఇదేనా కేంద్ర ప్రభుత్వ వైఖరి? అని ప్రశ్నించారు. సి1+50 శాతం సూత్రం ప్రకారం కనీస మద్ధతు ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేస్తే, ఆ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎక్కడా అమలు చేయటం లేదని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఏ యేడాదికి ఆ యేడాది ధర మారుతూ ఉంటుందని, అందులో కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని పేర్కొన్నారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎంఎస్పీ నిర్ణయిస్తే, రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతుందని, అది కేంద్ర బడ్జెట్లో 7 నుంచి 8 శాతం ఉంటుందని తెలిపారు. దేశంలో అత్యధిక మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగం కోసం ఈ మాత్రం ఖర్చు చేయలేరా? ప్రశ్నించారు. దేశంలోని సగం రాష్ట్రాల కంటే అత్యధిక సాగు జరిగేదీ తెలంగాణలోనేనని, ఇది అందరు తెలుసుకోవాలని హితవు పలికారు. యాసంగిలో ఎక్కువ వరి పండేది తెలంగాణలోనేనని, ఏపిలో వరి విస్తీర్ణం కంటే తెలంగాణలోనే ఎక్కువని తెలిపారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే తాము చేసిన తప్పా? ప్రశ్నించారు. ''రైతులు పంట పండిస్తే అన్యాయమా?, కేంద్రం ఎదురొచ్చి సాయపడాల్సింది పోయి ఇదేం విధానం? రాజ్యాంగ పరంగా ఈ బాధ్యత కేంద్ర వద్ద ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం. ప్రధాని అయిన తర్వాత మోడీ మొదట రెండు హామీలు ఇచ్చారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగులు, స్వామినాథ్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామన్నారు. ఏడేండ్లు గడుస్తున్నా వాటి ప్రస్తావన లేదు. మీకు చేతకాకపోతే రాజ్యాంగ సవరణ చేసి పూర్తి బాధ్యత మాకు అప్పగించండి'' అన్నారు.
కిషన్ రెడ్డికి బాధ్యత లేదా?
''గుజరాత్‌లోనూ లేని 24 గంటల కరెంటు మేం ఇస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమస్యపై బాధ్యత లేదా? ఒక్కసారైనా ప్రధానితో మాట్లాడి సమస్య పరిష్కరించవచ్చు కదా. ఎంత సేపు పని చేసే ముఖ్యమంత్రిని తిట్టడమే ఆయన పని. ఈ పరిణామాలన్నింటినీ తెలంగాణ రైతులు, సమాజం గమనిస్తోంది'' నిరంజన్‌రెడ్డి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైతులతో పాటు దేశంలోని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
పీవీకి ఘన నివాళి...
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, ఎంపీలు కే.కేశవరావు, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ దేశానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.