Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల నుంచి చట్టవిరుద్ధంగా కొనుగోళ్లు
- అక్రమ భూ లావాదేవీకు కేంద్రబిందువుగా రామాయణ్ విద్యాపీఠ్ ట్రస్ట్
లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సుదీర్ఘకాలంగా ఉన్న సంక్లిష్ట సమస్యకు పరిష్కారం వచ్చినట్టయ్యింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వారి బంధువులు భూములను కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అసలు విషయంలోకి వెళితే.. దళితుల నుంచి చట్టవిరుద్ధంగా భూములను ఓ ట్రస్టు స్వాధీనం చేసుకోగా, వారి నుంచి అధికారుల బంధువులు కొనుగులో చేసి మళ్లీ ట్రస్టుకు విక్రయించడంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భూ లావాదేవీలు అనేక ప్రశ్నలను సైతం లేవనెత్తుతున్నాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ భూ అక్రమ లావాదేవీలకు ప్రధాన కేంద్రబిందువుగా మహేష్ యోగి స్థాపించిన మహర్షి రామాయణ్ విద్యాపీఠ్ ట్రస్ట్ (ఎంఆర్వీటీ) ఉంది. ఈ ట్రస్టు 1990 ప్రారంభంలో రామ మందిర స్థలానికి 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న బర్హతా మంజా గ్రామంలో పెద్ద మొత్తంలో భూములను స్వాధీనం చేసుకుంది. అలాగే, ఆయోధ్యలోని పలు గ్రామాల భూములను సైతం కొనుగోలు చేసింది.
దాదాపు 21 బిఘాలు (సుమారు 52,000 చదరపు మీటర్లు) నిబంధనలను ఉల్లంఘించి దళితుల నుంచి కొనుగోలు చేసింది. ఉత్తరప్రదేశ్ రెవిన్యూ కోడ్ రూల్స్ (2016 నుంచి, అంతకు ముందు జమిందారీ రద్దు చట్టం) ప్రకారం దళిత వ్యక్తులకు చెందిన వ్యవసాయ భూమిని (3.5 బిఘా కంటే తక్కువ కలిగి ఉంటే) ఆ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమంటూ నిషేధం ఉంది. అయితే, ఎంఆర్వీటీ మాత్రం 1992లో సుమారు డజనుకు పైగా దళితుల నుంచి భూమిని కొనుగోలు చేసింది. దీని కోసం ఎంఆర్వీటీకీ చెందిన దళిత ఉద్యోగి రోంఘైని ట్రస్టు ఉపయోగించుకుంది. దళితుల భూముల కొనుగులోపై నిషేధం ఉండటంతో మొదటగా ఆ భూములను ఎంఆర్వీటీకి చెందిన దళిత ఉద్యోగి రోంఘై పేరున కొనుగులు చేసినట్టు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత రోంఘై జూన్ 1996లో ఆ భూములను ఎంఆర్వీటీకి దానం చేస్తున్నట్టుగా విరాళ పత్రాలపై సంతకాలు చేసినట్టుగా భూరికార్డుల్లో జాబితా చేయబడింది. 1996 సెప్టెంబర్ 3న ఈ దళితుల భూములన్ని ఎంఆర్వీటీ పేరిట రిజిస్టర్ అయ్యాయి. ఈ కొనుగోలు లావాదేవీలు గమనిస్తే.. రోంఘై ద్వారా ఎంఆర్వీటీ ఈ భూములను సుమారు రూ.6.38 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ రేటు (2017 నుంచి అమల్లో ఉన్నవి) ప్రకారం ఈ భూముల విలువ రూ.8 కోట్ల పైనే.ఈ భూములను కోల్పోయిన వారిలో ఒకరైన మహాదేవ్.. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అతని మూడు బిఘాలకు రూ.1.02 లక్షలు అందాయి. రోంఘై ద్వారా కోనుగోలు చేయబడిన ఈ భూములను చట్ట విరుద్ధంగా బదిలీ చేయబడ్డాయని మహాదేవ్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు అదనపు కమిషనర్ శివ్ పుజన్, ఆ తర్వాత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గోరేలాల్ శుక్లాతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి బదిలీపై దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే 2020 అక్టోబరు 1న అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ కుమార్ ఝా.. దళితుల నుంచి చట్టవిరుద్ధంగా భూములను కొనుగోలు చేయడంపై ఎంఆర్వీటీ, కొంత మంది ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ఈ కమిటీ నివేదికను ఆమోదించినట్టు రికార్డులు పేర్కొంటున్నాయి. దీనిని అయోధ్య డివిజనల్ కమిషనర్ ఎంపీ అగ్రవాల్ మార్చి 18, 2021న ఆమోదించారు. చివరకు ఈ ఏడాది ఆగస్టు 6న అయోధ్యలోని అసిస్టెంట్ రికార్డ్ ఆఫీసర్ (ఏఆర్వో) భాన్ సింగ్‌పై కేసు నమోదైంది. రెవిన్యూ ఆర్డర్ల సవరణ/సమీక్ష కోసం దాఖలు చేసిన దరఖాస్తుల అప్పిలేట్ అథారిటీ అగ్రవాల్ విచారణ నివేదికపై చర్యల కోసం బోర్డ్ ఆఫ్ రెవిన్యూకు పంపినప్పటికీ అతని బంధువులు ఎంఆర్వీటీ నుంచి భూమిని కొనుగోలు చేశారు. ఈ ట్రస్ట్‌పై కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. అగర్వాల్ మామ, బావలు వరుసగా 2,530 చదరపు మీటర్లు, 1,260 చదరపు మీటర్ల భూమిని 2020 డిసెంబర్ 10 ఎంవీఆర్టీ నుంచి కొనుగోలు చేశారు.
అప్పటి చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ (సీఆర్వో) పురుషోత్తం దాస్ గుప్తా, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) దీపక్ కుమార్.. మరో ఇద్దరు ప్రభుత్వ అధికారుల సమీప బంధువులు కూడా ఈ ఏడాది అక్టోబర్ 12న 1,130 చదరపు మీటర్లు, సెప్టెంబరు 1న 1,020 చదరపు మీటర్లను ఎంఆర్వీటి నుంచి కొనుగోలు చేశారు. బర్హతా మంజా గ్రామంలోని ఎంఆర్వీటి నుంచి భూమిని కొనుగోలు చేసిన ఇతరులలో అయోధ్య జిల్లాలోని గోసాయిగంజ్ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీ కూడా ఉన్నారు. అలాగే, ప్రస్తుతం రిటైర్ అయిన పలువురు అధికారులు కూడా ఉన్నారు. అయితే, ఈ భూ కోనుగోళ్లకు సంబంధించిన విషయంలో మొత్తంగా ఎంఆర్వీటినే నిందితుడిగా పేర్కొనడంపైనా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే, రోంఘై కుటుంబం ప్రయాగ్‌రాజ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహవ్ పూర్ గ్రామంలో అయోధ్యకు దూరంగా నివసిస్తున్నారు. మొత్తంగా దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ భూఅక్రమాలకు సంబంధించి ఓ కేసు నమోదైంది.
విచారణకు యూపీ సర్కారు ఆదేశం
ఈ ఆరోపణల నేపథ్యంలో దీనిపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అంశంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించినట్టు సమాచార శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. దాదాపు 15 మంది స్థానిక రాజకీయ నాయకులు, ప్రస్తుతం, అంతకముందు ఇక్కడ విధులు నిర్వర్తించిన అధికారులు, వారి దగ్గరి బంధువులపై ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్ పార్శిల్ కొనుగోలులో ప్రమేయం ఉదందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ రికార్డ్ ఆఫీసర్ ఇప్పుడు ట్రస్ట్‌పై కేసులను విచారిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా? లేదా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యోగి సర్కారు తాజా ఆదేశాలు జారీ చేసిందా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
విమర్శలు
అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం సేకరిస్తున్న భూకొనుగోలు అక్రమాల నేపథ్యంలో ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అయోధ్య భూ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె సర్వోన్నత న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడుతున్నందున ఈ అంశాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు.