Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత మార్పిడి బిల్లు వివాదం నేపథ్యంలో..
బెంగళూరు : కర్నాటకలో మత మార్పిడి బిల్లుపై వివాదం రేగుతున్న నేపథ్యంలో దక్షిణ కర్నాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో గురవారం చర్చిపై దాడి జరిగింది. 160ఏండ్ల నాటి సెయింట్ జోసెఫ్ చర్చిలో సెయింట్ ఆంథోనీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం విరిగిన విగ్రహాన్ని తీసుకువెళ్లిపోయారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. చర్చి ప్రీస్ట్ ఫాదర్ జోసెఫ్ ఆంథోనీ డేనియల్ మీడియాతో మాట్లాడుతూ, గురువారం తెల్లవారు జామున 5.30గంటలకు ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. బెంగళూరుకు 65కిలోమీటర్ల దూరంలో ఈ చర్చి వుంది. చర్చికి వచ్చిన వ్యక్తి తెల్లవారు జామున 5.40గంటలకు పరిస్థితిని చూసి వెంటనే ఫాదర్‌కి ఫోన్ చేశారు. ఆయన వెంటనే చర్చికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ ఈ రీతిలో దాడి, విధ్వంసం జరగలేదని ఫాదర్ పేర్కొన్నారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాదాపు 40ఏండ్ల క్రితం స్థాపించిన విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కర్నాటకలో ఇటీవలి కాలంలో క్రైస్తవ ప్రార్ధనా సమావేశాల్లో తరచుగా ఏదో ఒక రకంగా గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా మత స్వేచ్ఛా హక్కును రక్షించే బిల్లును ప్రవేశపెట్టారు. బలవంతంగా మత మార్పిడిని నిరోధించేందుకు ఈ బిల్లును ఉద్దేశించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ రాష్ట్రంలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికేనని విమర్శకులు పేర్కొంటున్నారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఇటువంటి బిల్లుల కన్నా ఇది మరింత కఠినంగా వుందని వారన్నారు. బిల్లుకు నిరసనగా రాజధాని బెంగళూరుతో సహా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి.