Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలహాబాద్ : ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దాదాపు రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌కు అలహాబాద్ హైకోర్టు విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన సమూహాలపై నిషేధం విధించాలని తెలిపింది. ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 'ర్యాలీలను ఆపకపోతే.. పరిణామాలు సెకండ్ వేవ్‌కన్నా దారుణంగా ఉంటాయి. జీవితముంటేనే.. మనకు ప్రపంచం ఉండేది' అని జస్టిస్ శేఖర్ యాదవ్ అన్నారు. రోజువారీ కేసులు పెరుగుతున్నాయనీ, పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడుతున్నారనీ, సామాజిక దూరం పాటించడం లేదనీ, కోర్టు నిత్యం రద్దీగా ఉంటుందంటూ పలు సమస్యలు ఆయన దృష్టికి రావడంతో న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న న్యాయమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. కోవిడ్ కేసుల సంఖ్య... లాక్డౌన్ విధిస్తున్న దేశాల గురించి వస్తున్న నివేదికలను ప్రస్తావించారు. 'గ్రామ పంచాయతీ, బెంగాల్ ఎన్నికలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అనేక మంది మరణించారు' అని పేర్కొన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయనీ, ఇలాంటి సమయాల్లో ప్రోటోకాల్‌ను అనుసరించడం అసాధ్యమని అన్నారు. పార్టీలు ప్రచారం చేయాలనుకుంటే.. దూరదర్శన్, న్యూస్ పేపర్లను వినియోగించుకోవాలని సూచించారు.