Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ
- ఎడ్ల బండిపై గ్రామంలోకి...
కంచికచర్ల : దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలనీ, వాటి పరిష్కారానికి పజల మధ్య ఐక్యత ఒక్కటే మార్గమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. సుప్రీంకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. సన్మానించారు. అనంతరం రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో జస్టిస్ రమణ మాట్లాడారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతున్నా మరోవైపు దేశంలో కొన్ని సమస్యలు, అసమానతలు తలెత్తుతన్నాయన్నారు. వాటి పరిష్కా రానికి ప్రజలంతా కుల మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉండడమే మార్గమని అన్నారు. దేశ, విదేశాల్లో తెలుగుజాతి ఔన్నత్యం, గౌరవం పెంచాలన్నారు. తెలుగు భాష ఉన్నతికి కృషి చేయాలన్నారు. తన చిన్నతనంలో తన స్వగ్రామం పొన్నవరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రభావం ఉండేదనీ, ప్రజలు ఎన్నికల రోజు మాత్రమే రాజకీయాలు మాట్లాడేవారినీ, తర్వాత అందరూ ఐక్యంగా ఉండేవారని గుర్తుచేశారు. గ్రామమే కాదు...రాష్ట్రం, దేశం మొత్తంగా ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలతోపాటు ఎమర్జెన్సీ లాంటి సంఘటనలు తనలో రాజకీయ చైతన్యాన్ని నింపాయన్నారు.
జస్టిస్ ఎన్.వి.రమణ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామం మీదగా పొన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా పొన్నవరం గ్రామ పొలిమేర వద్ద ఎన్వి రమణ దంపతులకు గ్రామస్తులు మేళతాళాలతో పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఎక్కి గ్రామంలోకి తోడ్కొని వచ్చారు. జస్టిస్ రమణ చెర్నాకోలా పట్టుకొని ఎద్దుల బండి నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. స్నేహితులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి తన సోదరుడు నూతలపాటి వీర నారాయణ ఇంట్లో భోజనం చేశారు.