Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యంపై ఏడు లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదు
- కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రెండు రోజులు వేచి చూసి.. మళ్లీ వస్తాం
- రాష్ట్రానికి తిరిగొచ్చిన తెలంగాణ మంత్రులు, ఎంపీల హెచ్చరిక
న్యూఢిల్లీ : ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయక పోతే మేమే కొనుగోలుచేస్తాం.. వాటిని ఢిల్లీకి తీసుకొచ్చి... ఇండియా గేట్ ముందు పారబోస్తాం' అని తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి మరో రెండు రోజుల సమయం ఇచ్చి శుక్రవారం తిరిగొచ్చారు. అంతకు ముందు ఇక్కడి తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో అదనపు ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, రైతులకు డబ్బు చెల్లిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రెండు రోజులు వేచి చూసి మళ్ళీ ఢిల్లీకి వస్తామని స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్రానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తూ ఏడు లేఖలు రాశామనీ, కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఖరీఫ్ పంట కొనుగోలుపై లిఖితపూర్వక హామీ కోసం వేచిచూశామనీ, కానీ కేంద్రం మొండిగా ఉందని విమర్శించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయనీ, తాము ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచాలా? వద్దా? అన్న అంశాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదని విమర్శించారు. వచ్చే యాసంగి నుంచి తెలంగాణలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చాలా అబద్దాలు చెప్పారని అన్నారు. ధాన్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ఎఫ్సీఐ ధాన్యం తీసుకెళ్లడం లేదని విమర్శించారు. మిల్లర్ల నుంచి బియ్యం తీసుకు వెళ్లాలని కేంద్రానికి ఏడు లేఖలు రాశామనీ, కానీ రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాములు నిండిపోయాయని తెలిపారు. ఏపీలోని జగ్గయ్య పేటలో గోదాముల ఖాళీగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనీ, కర్నాటక బీదర్లో 10 వేల టన్నుల ధాన్యం నిల్వ చేసే గోదాము ఖాళీగా ఉన్నా ఇవ్వలేదని విమర్శించారు. ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామంటే, కేవలం మూడు లక్షల టన్నుల బియ్యాన్నే తీసుకువెళ్లారని విమర్శించారు. గోదాముల ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనీ, బియ్యాన్ని తీసుకువెళ్లడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. తాము రాసిన ఏడు లేఖలకు కేంద్రం ఎందుకు స్పందించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దీన్ని ఇంతటితో వదలం : నిరంజన్ రెడ్డి
కేంద్ర వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదనీ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సి.నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని హెచ్చరించారు. బీజేపీ కోఆపరేటివ్ ఫెడరలిజం కాకుండా, సెలెక్టివ్ ఫెడరలిజం విధానాన్ని అమలు చేస్తున్నదని ఆరోపించారు. మెజారిటీ ఉందని నచ్చినట్టు చేస్తే సమయం వచ్చినప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాలనలో అహంకార స్వభావం పనికిరాదని హితవు పలికారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, రైతుల ఆదాయం రెట్టింపు ఏమో కానీ ధాన్యాన్ని ఇండియా గేట్ వద్ద పారబోసే పరిస్థితిని సృష్టించారని విమర్శించారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం అవమానకరంగా ఉందనీ, మోడీ సర్కార్ నూనె గింజలు పండించే పరిస్థితులు కల్పించలేదని విమర్శించారు. దేశ పౌరులకు కష్టాలు తెచ్చి దేశ భక్తి అంటే ఎలా? అని ప్రశ్నించారు. రైతుల పంట కొనుగోలు చేయకుండా దేశ ప్రజలకు ఏం చెప్పదలచుకోనున్నారని నిలదీశారు. కేవలం ఛాతే కాదు.. దాని లోపల హృదయమూ 56 అంగులాలు ఉండాలని ఎద్దేవా చేశారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వేచి చూస్తామని, దీన్ని ఇంతటితో వదలమని స్పష్టం చేశారు.
లిఖితపూర్వకంగా ఇవ్వకపోవడం దురదష్టకరం : ప్రశాంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తుందో లిఖితపూర్వకంగా ఇవ్వాలని తాము ఎంత అడిగినప్పటికీ ఇవ్వకపోవటం దురదష్టకరమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వర్షాకాలం ధాన్యం సేకరణ కోసం ఢిల్లీకొస్తే, వచ్చే యాసంగి పంట గురించి పదే పదే చెప్పడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కేంద్ర వైఖరి వల్ల వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని దుయ్యబట్టారు. తెలంగాణలో వర్షాకాలం పంట కొనుగోళ్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ పూర్తి అయిందనీ, మిగిలిన ధాన్యాన్ని తీసుకోవడంపై లిఖితపూర్వక హామీ కోసమే ఢిల్లీ వచ్చామని అన్నారు.
బీజేపీ మోసం చేస్తోంది : ఎర్రబెల్లి
రాష్ట్ర రైతాంగాన్ని బీజేపీ మోసం చేస్తున్నదని పంచాయతీ రాజ్ గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రెండు రోజుల్లో లేఖ ఇస్తామన్నారనీ, మళ్ళీ ఏమైందో లేఖ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
తమకు తెలియకుండా కేంద్రం లేఖ ఇస్తుందా? అని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారంటే, వారు రైతు బిడ్డలా? తెలంగాణ బిడ్డలా? అనుమానం వస్తుందని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం పక్షాన బీజేపీ నేతలుండాలనీ, రాజకీయం చేయకూడదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే, యావత్తు భారతదేశానికి తమ నిరసనను తెలిపేలా భవిష్యత్తులో ముందుకెళ్తామని హెచ్చరించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? మన రైతులు దేశానికి చెందిన వారు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు రైతులు గురించి ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తుందని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే తాము పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, వెంకటేష్ నేత, కెఆర్ సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, మన్నె శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.