Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా పోరాటాన్ని కొనసాగిస్తాం
- ఎన్నికల్లో సంఘాల పేర్లను వాడకూడదు : ఎస్కేఎం
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని మోర్చాకు చెందిన తొమ్మిది మంది సభ్యుల సమన్వయ కమిటీ నాయకులు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, దర్శన్ పాల్ శనివారం తెలిపారు. దేశవ్యాప్తంగా 400లకు పైగా విభిన్న భావజాల సంఘాల వేదికగా ఉన్న ఎస్కేఎం కేవలం రైతుల సమస్యలపైనే ఏర్పడిందన్నారు. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడం లేదనీ, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం నుంచి హక్కులు పొందేందుకు విస్తృత ఐక్య కూటమి ఏర్పాటు చేశామనీ, మూడు వ్యవసాయ చట్టాల రద్దు అనంతరం పోరాటాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై జనవరి 15న జరిగే ఎస్కెఎం సమావేశంలో తీర్మానం చేస్తామని తెలిపారు. పంజాబ్లోని 32 రైతు సంఘాలకు సంబంధించి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు, లేదా సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), లేదా 32 సంఘాల పేర్లను ఉపయోగించరాదని నిర్ణయించినట్టు తెలిపారు. అలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందన్నారు.
32 సంఘాల నేతలు క్రాంతికారి కిసాన్ యూనియన్ (దర్శన్పాల్), బీకేయూ క్రాంతికారి (సూర్జిత్ ఫూల్), బీకేయూ సిద్ధూపూర్ (జగ్జిత్ దల్లేవాల్), ఆజాద్ కిసాన్ కమిటీ దోబా (హర్పాల్ సంఘా), జై కిసాన్ ఆందోళన్ (గురుబక్ష్ బర్నాలా), దాసుహ గన్నా సంఘర్ష్ కమిటీ (సుఖ్పాల్ దఫర్), కిసాన్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ (ఇందర్జిత్ కోట్బుధా), లోక్ భలాయి ఇన్సాఫ్ వెల్ఫేర్ సొసైటీ (బల్దేవ్ సిర్సా), కీర్తి కిసాన్ యూనియన్ పంజాబ్ (హర్దేవ్ సంధు) తదితర సంఘాలు ఎన్నికల్లో పోటీకి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసుకున్నాయని ఆయా నాయకులు స్పష్టం చేశారు.