Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో రైతు విజయోత్సవ ర్యాలీలో మాణిక్ సర్కార్ పిలుపు
- బీజేపీని ఓడించాలి : వారణాసిలో ఏఐకేఎస్ సభ
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్, త్రిపురలోని విప్లవ్ దేవ్ సర్కార్ నిరంకుశ, మతతత్వ విధానాలపై పోరాటాన్ని నిర్మించాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనీ, వాటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరముందని అన్నారు. కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలపై జరుగుతున్న ఆందోళనల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇటీవల సుదీర్ఘంగా పోరాడి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రైతాంగానికి సెల్యూట్ పలికారు. తమకెవ్వరూ అడ్డులేరని విర్రవీగే పాలకుల నడ్డివిరిచిన రైతులకు అభివందనాలు తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్త రైతుల పోరాటం విజయాన్ని పురస్కరించుకొని శనివారం త్రిపుర రాజధాని అగర్తలాలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) భారీ రైతు విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్), గణ ముక్తి పరిషత్ (జీఎంపీ), ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఏఐఏడబ్ల్యూయూ) కార్యకర్తలు కదంతొక్కారు. దాదాపు 15 వేల మంది పాల్గొన్న ఈ భారీ ప్రదర్శన ఎర్ర జెండాలతో అగర్తల వీధుల గుండాసాగింది. రైతు డిమాండ్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని నినాదాలతో హౌరెత్తించారు. కళాకారులు హిందీ, బెంగాలీ, కోక్ బరాక్ భాషలలో పాటలు, నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మాట్లాడుతూ అటు కేంద్రంలో, ఇటు త్రిపుర రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, నిరంకుశ, మతతత్వ విధానాలపై విమర్శలు చేశారు. ప్రజల సమస్యలపై విస్తృత నిరంతర పోరాటాలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని నాశనం చేశారనీ, రాష్ట్రంలో అభివృద్ధి అంతా స్తంభించిపోయిందని విమర్శించారు. త్రిపుర అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌కు సంబంధించిన 125 రాజ్యాంగ సవరణ బిల్లును వెంటనే పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో కోక్ బరాక్ భాషను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ, జీఎంపీ అధ్యక్షుడు జితేంద్ర చౌదరి మాట్లాడుతూ రైతులకు తగినన్ని ఎరువులు, పురుగు మందులను త్రిపుర ప్రభుత్వం వెంటనే చౌక ధరలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆవుల పెంపకం వ్యవస్థను వెంటనే ప్రారంభించాలనీ, ఈ కనెక్షన్లో డోర్‌స్టెప్ కార్మికులను ఉపయోగించాలని సూచించారు. ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే మాట్లాడుతూ రైతులను మోసం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించిందనీ, కానీ రైతులు మోడీ మెడలు వంచారని తెలిపారు. ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబిత్రా కర్ మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధనను పునరుద్ధరించాలని, త్రిపురలోని ఎనిమిది జిల్లాల్లో శాస్త్రీయ వ్యవసాయ కేంద్రాలు తప్పనిసరిగా ఐసీఏఆర్ సహాయంతో చురుకుగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని సొంత నియోజకవర్గంలో బహిరంగ సభ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని ఓటమిని రుచి చూపించాలని ఏఐకేఎస్ పిలుపునిచ్చింది.
వారణాసిలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దీనానాథ్ సింగ్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఏడాదికి పైగా సుదీర్ఘంగా జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటం దెబ్బకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చిందనీ, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించక తప్పలేదని అన్నారు. అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి మరణించిన కిసాన్ నాయకుడు దీనానాథ్ సింగ్ యాదవ్‌కు నివాళులర్పిస్తూ ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే రైతుల పోరాటం చారిత్రాత్మక విజయాన్ని కొనియాడారు. ఎంఎస్పీతో పాటు రైతులు, కార్మికుల డిమాండ్ల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి హీరాలాల్ యాదవ్, ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముకుత్ సింగ్, రాష్ట్ర కోశాధికారి బాబూరామ్ యాదవ్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రవిమిశ్రా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమనాథ్ రారు, ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎల్ భారతి, రాష్ట్ర మాజీ మంత్రి సురేంద్ర పటేల్, ఎస్జేపీ నాయకుడు అఫ్లతున్ దేశారు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గంలో ఈ బహిరంగ సభ జరగడం విశేషం.