Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్, ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వున్న లేదా వ్యాక్సినేషన్ రేటు తక్కువగా వున్న 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆఫీసు మెమోరాండంలో తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కర్నాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్‌లకు ఈ బృందాలు వెళ్లాయి. వివిధ వార్తా చానెళ్ల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, అంతర్గత సమీక్షల ద్వారా కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని, కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ రేటు జాతీయ సగటు కన్నా తక్కువగావుంది. దీంతో పరిస్థితులను దృష్టిలో వుంచుకుని, వెంటనే అక్కడకు బహుళ విభాగాల నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపామని ఆ మెమోరాండం తెలిపింది. మూడు నుండి ఐదు రోజుల పాటు ఈ బృందాలు రాష్ట్రాల్లో వుంటాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులతో కలిసి వీరు పనిచేస్తారు. కోవిడ్ నిబంధనలు సరిగా అమలవుతు న్నాయా లేదా, ఆస్పత్రుల్లో బెడ్లు సరిపడా వున్నాయా, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ వంటి మౌలిక సదుపాయాలు తగినంతగా అందుబాటులో వున్నాయా లేదా అనేది ఈ బృందాలు పరిశీలిస్తాయి. రాష్ట్ర స్థాయిలో కేంద్ర బృందాలు పరిస్థితిని అంచనా వేసి, పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాయి.