Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య శనివారం ఉదయానికి 415కి పెరిగింది. శుక్రవారం ఉదయానికి 358 కేసులు ఉన్నాయి. ఒక్కరోజులోనే 57 పెరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు 108కి, ఢిల్లీలో 79కి చేరాయి. గుజరాత్లో 43, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్తాన్‌లో 22, హర్యానా, ఒడిశాలో నాలుగేసి, జమ్ముకాశ్మీర్, పశ్చిమ బెంగాల్లో మూడేసి, ఉత్తరప్రదేశ్‌లో 2, చత్తీస్‌గఢ్, లడక్, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గత 24 గంటల్లో తెలంగాణలో మూడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో, ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. బాధితుల్లో 115 మంఇ కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
పది రాష్ట్రాలకు బృందాలు
కోవిడ్, ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వున్న లేదా వ్యాక్సినేషన్ రేటు తక్కువగా వున్న 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆఫీసు మెమోరాండంలో తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కర్నాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్‌లకు ఈ బృందాలు వెళ్లాయి. వివిధ వార్తా చానెళ్ల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, అంతర్గత సమీక్షల ద్వారా కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని, కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ రేటు జాతీయ సగటు కన్నా తక్కువగావుంది. దీంతో పరిస్థితులను దృష్టిలో వుంచుకుని, వెంటనే అక్కడకు బహుళ విభాగాల నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపామని ఆ మెమోరాండం తెలిపింది. మూడు నుండి ఐదు రోజుల పాటు ఈ బృందాలు రాష్ట్రాల్లో వుంటాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులతో కలిసి వీరు పనిచేస్తారు. కోవిడ్ నిబంధనలు సరిగా అమలవుతున్నాయా లేదా, ఆస్పత్రుల్లో బెడ్లు సరిపడా వున్నాయా, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ వంటి మౌలిక సదుపాయాలు తగినంతగా అందుబాటులో వున్నాయా లేదా అనేది ఈ బృందాలు పరిశీలిస్తాయి. రాష్ట్ర స్థాయిలో కేంద్ర బృందాలు పరిస్థితిని అంచనా వేసి, పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాయి. ప్రతి రోజూ సాయంత్రానికల్లా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతాయి.
ఒమిక్రాన్ సోకిన 90శాతం మందిలో ఇవి కామన్
మనదేశంలో ఒమిక్రాన్ భారినపడిన వారిలో అధికశాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడడం లేదని, కొందరిలో కనిపించినా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని ఢిల్లీకి చెందిన పలువురు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకినప్పటికీ త్వరగా కోలుకుని డిశ్చారి అవుతున్నారని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ తెలిపారు. తీవ్రమైన లక్షణాలు ఎవరిలోనూ కనబడటం లేదని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90 శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేవని, వాళ్లకు చికిత్స కూడా అందించాల్సిన అవసరం కూడా లేకపోవడం ఊరటిచ్చే అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో తొలిసారి ఒమిక్రాన్ గుర్తించిన వైద్యురాలు డాక్టర్ అంజెలిక్ కూట్టీ ఆ వ్యాధి వివరాలను తెలిపారు. తమ దేశంలో ఒమిక్రాన్ సోకిన వారంలో సాధారణ చికిత్సతోనే కొలుకుంటున్నారని చెప్పారు. ఒమిక్రాన్ ఇన్ఫ్క్షన్ను గుర్తించాక ఓ మోస్తరు స్థాయిలో కొన్ని ఔషధాలను ఇవ్వడం ద్వారా కండరాల నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందొచ్చని సూచించారు. ఆక్సిజన్ , యాంటీబయోటిక్స్ వినియోగించాల్సిన అవసరం లేదన్నారు.
7,189 మందికి కొత్తగా కరోనా
గత 24 గంటల్లో దేశంలో 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 7,189 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 7,186 మంది కోలుకున్నారు. 387 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4,79,520కి చేరింది. శనివారం 66 లక్షల మందికి టీకా వేశారు. దీంతో, మొత్తం 141 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.